Oct 15,2021 06:46

    భయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు మొత్తం ఐదు ప్రాజెక్టుల్లోని 29 డైరెక్ట్‌ అవుట్‌లెట్లను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) పరిధిలోకి తీసుకోవాలని మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించడం ఆశ్చర్యకరం, అభ్యంతరకరం. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలను, కొన్ని అభ్యంతరాలను బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పట్టించుకోకపోవడం ఆందోళనకరం. కృష్ణా జలాల్లో తెలంగాణకు సమవాటా కేటాయించేవరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం బోర్డును కోరింది. కాగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కిందనున్న అవుట్‌లెట్లను బోర్డు పరిధికి తీసుకోవడాన్ని ఎపి ప్రభుత్వం అంగీకరించింది. ఆ 29 కేంద్రాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై బోర్డు ఆధీనం లోకి వస్తాయని సమావేశానంతరం బోర్డు అధికార్లు ప్రకటించారు. ఫలితంగా జల విద్యుత్‌ ఉత్పత్తి మొదలు పంట కాలువలకు నీటి విడుదల వరకూ అన్ని విషయాలూ కెఆర్‌ఎంబి పరిధిలోకి అంటే కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. ఇంత ఘోరమైన కేంద్రీకరణ దేశంలో ఇంకెక్కడా ఉండివుండదు. ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా మరో నిర్దిష్ట అంశంపై రెండు రాష్ట్రాలమధ్య తీవ్ర వివాదం ఏర్పడితే అంతవరకు పరిమితమై కేంద్రం మధ్యవర్తిత్వం లేదా మరో రీతి పరిష్కారాన్ని సూచించవచ్చు కాని ఇలా పంట కాలువలపై సైతం పెత్తనాన్ని చట్టబద్ధం చేయబూనడం పరమ దుర్మార్గం.
     కృష్ణా - గోదావరి జలాలపై గతంలో కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించకుండా, ఒక సమగ్రమైన అవగాహన లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను అప్పగించడం వలన భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయి. నీటి పంపిణీపై పర్యవేక్షణ వేరు, మొత్తం నదీజలాలపై కేంద్ర ఆధిపత్యం వేరు. ఈ రెండు ప్రాజెక్టుల జలాల పంపిణీ పర్యవేక్షణకే బోర్డు పరిమితం కావాలి తప్ప ప్రతి నీటి బొట్టుపైనా ఆధిపత్యం చెలాయించడం సమర్ధనీయం కాదు. నదీ జలాల విషయంలో కేంద్ర పెత్తనం పెరగడంవల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది నిపుణుల మాట. కృష్ణానదీ జలాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు ఉందని, అది తేలకుండా ఇలా చేయడం సరైంది కాదని కూడా వారంటున్నారు. కాబట్టి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఏకోన్ముఖంగా తిరస్కరించడం అవసరం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించుకుని ఏకాభిప్రాయానికి వచ్చి కేంద్ర పెత్తనాన్ని ప్రతిఘటించ వలసిందిపోయి పొరుగు రాష్ట్రం ఒప్పుకుంటే తామూ ప్రాజెక్టులపై అధికారాన్ని వదులుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం లొంగుబాటు వైఖరిని ప్రదర్శించడమే !
    భారత రాజ్యాంగం ప్రకారం జల వనరుల అంశం రాష్ట్ర జాబితాలోనిది. కాని, కెఆర్‌ఎంబి గెజిట్‌ ప్రతిపాదనలతో పూర్తిగా కేంద్రం ఆధిపత్యంలోకి వెళ్తుంది. సహకార ఫెడరలిజం అని మేనిఫెస్టోలో పేర్కొన్న బిజెపి ఆచరణలో ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. ఒకే దేశం- ఒకే పన్ను- ఒకే భాష- ఒకే మతం- ఒకే ఎన్నికలు... ఇలా అన్నిటినీ కేంద్రం వద్దనే కేంద్రీకరించుకుంటూ 'భిన్నత్వంలో ఏకత్వం' అన్నదాన్ని భూ స్థాపితం చేస్తోంది. జల వనరులపైన, వాటి పంపిణీపైన కేంద్ర పెత్తనం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, రాష్ట్రాల ప్రయోజనాలకు హానికరం. రాష్ట్రాల అధికారాలను చేజిక్కించుకొని వాటిని నామావశిష్టం చేసి అధ్యక్ష తరహా నిరంకుశ పాలన దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. ఈ దశలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, రాష్ట్రాల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా కాకుండా లొంగుబాటు ధోరణితో వ్యవహరిస్తే ప్రజాదరణను పోగొట్టుకొని ప్రతిఘటనను ఎదుర్కోవలసివస్తుంది.