Nov 23,2022 00:04

నిరసన తెలియజేస్తున్న సిఐటియు నేతలను అడ్డుకుంటున్న పోలీసు

ప్రజాశక్తి - పరవాడ
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పరవాడ ఎన్‌టిపిసి పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. పరవాడ సినిమా హాల్‌ జంక్షన్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ, రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఏమి ముఖం పెట్టుకుని విశాఖలో పర్యటన చేస్తూన్నారని సీఐటీయూ నాయకులు దుయ్యబట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మివేస్తూ, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీజేపీకి రాష్ట్రంలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వైసీపీ నేతలు కూడా బీజేపీ ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో సీఐటీయూ నాయకుల అక్రమ అరెసు, గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం, సిఐటియు నాయకులు కె.నాయుడు, గోరుపోటీ శ్రీను, అట్చిబాబు, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు నాయకులు గనిశెట్టి గృహనిర్బంధం
మునగపాక రూరల్‌ : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరవాడ పర్యటన సందర్భంగా ఎన్‌టిసిపి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణను మండలంలోని వెంకటాపురం గ్రామంలో మంగళవారం ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకిి తీసుకుని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా తెల్లవారుజాము నుండి పోలీసులు తన ఇంటి వద్ద పహారా కాయడం, గృహనిర్బంధం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. బిజెపి ద్రోహంపై ప్రశ్నిస్తానని ముందుగా పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఎన్‌టిపిసి బర్నింగ్‌ ప్రమాదంలో గాయపడ్డ దళాయి రాంబాబుకు మెరుగైన వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని గనిశెట్టి డిమాండ్‌ చేశారు.

సిపిఎం ఖండన
గనిశెట్టి సత్యనారాయణను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఓ ప్రకటనలో ఖండించారు. ఉద్యమకారులపై నిర్బంధకాండ తగదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ, రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన బిజెపికి చెందిన మంత్రులు ఏ ముఖం పెట్టుకుని ఎపిలో అడుగుపెడుతున్నారని మండిపడ్డారు.