Oct 04,2023 01:08

ప్రజాశక్తి - భట్టిప్రోలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్యంపూర్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను కారుతో తొక్కించి మరణానికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడుని అరెస్టు చేసి మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ రైతు సంఘాల సమైక్య ఆధ్వర్యంలో తాహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు పరుస్తుందని అన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తూ ఢిల్లీలో సుమారు 700మందికిపైగా రైతులు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. కారుతో తొక్కించి ప్రాణాలు పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. అందుకు కారకుడైన మంత్రి కుమారుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, కె రామస్వామి, మర్రివాడ వెంకట్రావు, మురుగుడు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ, దీపాల సత్యనారాయణ, జి నాగరాజు, బట్టు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.