ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులకు, కూలీలకు తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు విమర్శించారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఇంతవరకు ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్లలోనూ రైతులకు, వ్యవసాయ రంగానికి నిధులు కోత పెట్టి ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎరువులపై రూ.50 వేల కోట్లు, ఉపాధి హామీ చట్టానికి రూ.30 వేల కోట్లు కోత విధించిందని తెలిపారు. దీని వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. గతేడాది చేసిన ఉపాధి హామీ పనులకు ఇంత వరకు రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. వలసలు నివారించేందుకు ఉపాధి హామీ నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమన్నారు. ఈ బడ్జెట్‌ను బలపరుస్తున్న తెలుగుదేశం, వైసిపి, జనసేన పార్టీలను రైతులు కూలీలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయడం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, వాటిపై ప్రకటన వచ్చే వరకు పోరాటాలను ముమ్మరం చేయాల్సి ఉందని తెలిపారు. ఏప్రిల్ 5న జరగనున్న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక నాయకులు చక్రధర్, ఏపీ రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు, బుద్ధ రంగారావు, కాళ్ళ తేలయ్య బాబు, ఏఐటీయూసీ నాయకులు వైఎన్ భద్రం, కోరిబిల్లి శంకర్రావు, నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










