ప్రజాశక్తి-వన్‌టౌన్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తూ, కార్పొరేట్లకు మేలు చేస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24వ తేదీన వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్దనున్న హెడ్ పోస్టాఫీస్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు పిలుపునిచ్చారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం పశ్చిమ నియోజకవర్గంలోని 37, 44, 50 డివిజన్లలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో అల్లాడిన కార్మికులు, ఉద్యోగులకు, రైతులకు, మహిళలకు, యువతకు, సామాన్య ప్రజానీకానికి ఈ బడ్జెట్‌లో మేలు జరుగుతుందని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా బిజెపి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేష్టలకు పొంతల లేకుండా మోడీ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష పన్నులు రూ.9 లక్షల కోట్లు అయితే, సామాన్య ప్రజానీకం నుండి పరోక్ష పన్నుల రూపంలో రూ.13 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఉపాధి కల్పన చేసే ప్రాజెక్టులలో పెట్టుబడులను తగినంతగా పెంచాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వేతనాలు పెంచి కేటాయింపులు భారీగా పెంచాలని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను, పార్లమెంట్‌లో పేర్కొన్న ప్రత్యేక హాోదా అంశాన్ని అమలు చేయాలని, ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువులపై జిఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి.సత్యబాబు, నగర కమిటీ సభ్యులు జి.వెంకట్రావు, జి.సుబ్బారెడ్డి, ఆర్.మోహన్, బి.పుల్లారావు, ఎస్.సుదర్శన్, కాంతారావు, ఎ.శ్రీనివాస్ పాల్గొన్నారు.










