
ప్రజాశక్తి- కె.కోటపాడు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో భారీగా నిధులు కోత విధించిందని ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినిబాబు అన్నారు. మండలంలోని చౌడువాడ గ్రామంలో శనివారం ఉపాధి కూలీలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో మోడీ ప్రభుత్వం రాకముందు ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో లక్షా 20వేలు కోట్ల రూపాయలు నిధులు కేటాయించగా, మోడీ ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ నేడు రూ.60 వేల కోట్లకు కుదించిందని తెలిపారు. అందులో మెటీరియల్ కాంపౌండ్స్ అర్జీలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, ఆర్‌బికెలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, కాలువలు వంటి వాటికి ఖర్చు చేస్తుందని చెప్పారు. రోజువారి కూలి రూ.600 ఇవ్వాలని, 200 పని దినాలు కల్పించాలని, రెండు పూటల పనికి స్వస్తి పలికి పాత విధానాన్ని కొనసాగించాలని, పనిముట్లకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల మండల కన్వీనర్ ఎర్ర దేవుడు, ఉపాధి మెట్లు, కూలీలు పాల్గొన్నారు.