ప్రజాశక్తి-చింతూరు
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన శుక్రవారం ఐటిడిఎ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి ముందు ఎర్రంపేట నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను అమలు చేయాలని, నాలుగు మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, తునికాకు ప్రూనింగ్ పనులు తక్షణమే చేపట్టాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విలీన మండలాల పర్యటనలో భాగంగా చింతూరు ఐటిడిఎకు విచ్చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆందోళన వద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం ఎఎస్‌ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, ఎటపాక మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు తదితరులు కలెక్టర్‌కు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ధాన్యం కొనుగోలు సరిగా చేపట్టకపోవడంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పశువులు పాలవుతున్నాయని తెలిపారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,376 కోట్లు డబ్బులు పడ్డాయని, త్వరలో మరో రూ.10 కోట్లు పడతాయని తెలిపారు. గతేడాది ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ డబ్బులు నేటికీ పడలేదని తెలియజేయగా, త్వరలోనే ఆ డబ్బులు కూడా పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలవరం పరిహారం, నిర్వాసితులకు పునరావాసంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలియజేయగా, వాటన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రెండవ పంటగా ఉన్న తునికాకు సేకరణ చేపట్టలేదని తెలిపారు. పక్క రాష్ట్రంలో కట్టకు రూ.5 చొప్పున వెలకట్టి తక్షణమే డబ్బులు చెల్లిస్తున్నారని, మన దగ్గర కట్టకు సగం రేటు కూడా ఇవ్వడం లేదని, పైగా సంవత్సరాల తరబడి డబ్బులు పెండింగ్‌లో ఉంచుతున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. గ్రామాల్లో రోడ్డు సౌకర్యం సరిగా లేదని, గోదావరి వరదలకు ఏర్పడిన సమస్యలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా అలాగే ఉన్నాయని చెప్పారు. వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి రెండు రోజులపాటు ఇక్కడే ఉంటున్నానని, ఈలోగా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విఆర్.పురం ఎంపీపీ కారం లక్ష్మి, కూనవరం వైస్ ఎంపిపి కొమరం పెంటయ్య, సిపిఎం నాయకులు మేకల నాగేశ్వరరావు, వడ్లది రమేష్, పల్లపు వెంకట్, గిరిజనులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వినతి
విఆర్.పురం : విఆర్.పురం మండలంలోని శ్రీరామగిరి, చింతరేవుపల్లి, పెద్దమట్టపల్లి ఎంపియుపి స్కూళ్లుతో పాటు వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 45 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎంపిపి కారం లక్ష్మి ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు శుక్రవారం చింతూరు ఐటిడిఎ వద్ద వినతి పత్రం అందించారు. విఆర్.పురం జెడ్‌పి హైస్కూల్, సున్నంవారి గూడెం ఆశ్రమ పాఠశాల, సోములగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులు, రేఖపల్లి జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌ను నియమించాలని కోరారు. పెద్ద మట్టపల్లి నుండి నర్సింగ్ పేటకు, గుల్లేటివారుకు, కుందులూరు నుండి టేకులూర్‌కు, మొలకలపల్లి నుండి వీర పాపన్న కుంటకు తారు రోడ్లు వేయాలని, కుందులూరు నుండి జల్లువారిగూడెం వరకు గ్రావెల్ రోడ్డును మంజూరు చేయాలని విజ్జప్తి చేశారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేయాలన్నారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, రేఖపల్లి సర్పంచ్ పూనెం సరోజిని, పెద్దమట్టపల్లి సర్పంచ్ వెట్టి లక్ష్మి, లక్ష్మణరావు, ప్రకాశరావు పాల్గొన్నారు.










