ప్రజాశక్తి-విజయవాడ
కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక బడ్జెట్ అని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా స్థానిక గవర్నర్‌పేటలోని లెనిన్ సెంటర్‌లో శనివారం సిఐటియు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించాలని, బడ్జెట్‌ను వ్యతిరేకించాలని నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లేనియెడల దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొంటామని తెలిపారు. ధర్నానుద్దేశించి సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు ,సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి ఎంవి సుధాకర్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక, ప్రజాసమస్యలు పరిష్కారం చేయని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను సవరించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రోజుకి 30 మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నేటి యువతలో 29 శాతం నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. 41 శాతం సంపద ఒక శాతం మంది చేతుల్లో కేంద్రీకరించబడి ఉందన్నారు. శతకోటేశ్వర్లు రోజుకి రెండున్నర కోట్లు సంపాదిస్తుంటే 35 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. నిత్యాసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ ప్రవేటీకరణ చేయవద్దని ,కార్మిక సంక్షేమ చట్టాలు తేవాలని, బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు .కానీ కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలు, పెట్రోల్, డీజిల్ గ్యాస్ సబ్సిడీలు, ఐసిడిఎస్ పథకం, ఆరోగ్య రంగం, ఉపాధి హామీ పథకం ,పెన్షన్ తదితర ప్రజా సంక్షేమాలకు గత సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తగ్గించారని విమర్శించారు .ఇటువంటి చర్య వలన ప్రజలపై ధరల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.60 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ఈ బడ్జెట్లో చేశారన్నారు. .మరోపక్క 15 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేయనున్నట్లు ప్రకటించారన్నారు.బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు చాలా తేడా ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా విభజన చట్టం ప్రకారం అవసరమైన నిధులు కేటాయించలేదని అన్నారు. మధ్యతరగతి ఆదాయ పన్ను మార్పులు కూడా తక్కువ శాతం మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో ప్రభుత్వం మార్పులు చేయకుంటే రానున్న రోజుల్లో ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఏ కమల ,కే దుర్గారావు, ఎం సీతారాములు ,వై సుబ్బారావు, ఎం బాబురావు, తిరుపతమ్మ, సిహెచ్ మురళి, ఎం డేవిడ్, సిహెచ్ నరసింహులు, కొండ, జగదీష్ పాల్గొన్నారు.










