ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్ముతున్నట్లే, అడవులను కూడా ప్రైవేట్‌పరం చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో ఆదివాసీ గిరిజనులకు అటవీ భూములు, సహజ వనరులే జీవనాధారం. కానీ ఆ భూముల నుండే గిరిజనులను గెంటివేస్తున్నారు. జంతు సంరక్షణ సాకుతో 10 లక్షల మంది గిరిజనులను అడవి నుండి గెంటేయాలని చూస్తున్నారు. అంటే జంతువులకు వుండే హక్కు కూడా గిరిజనులకు లేదన్నమాట. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర లేదు. అడవులు, భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయడం దుర్మార్గం.
ఫిబ్రవరి 1న లోక్‌సభలో రూ.39,44,909 కోట్లతో 2022-23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుని అమృతకాలం లోకి ప్రవేశించిందని, ఇది రాబోయే పాతికేళ్ల ''అమృతకాలపు బడ్జెట్'' అని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, వచ్చే వందేళ్ల కోసం బడ్జెట్‌ను రూపొందించామని ప్రధాని నరేంద్ర మోడీ గొప్పలు చెప్తున్నారు. కానీ కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికే ఈ బడ్జెట్. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్.టి జనాభా 10.43 కోట్లు (8.6 శాతం). 750 పైగా ఉన్న గిరిజన తెగల్లో వందకు పైగా తెగలు తమ మనుగడ సాగించలేక కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. అమృత కాలపు బడ్జెట్ అంటూ చెప్తున్న తియ్యటి మాటలను...కార్పొరేట్ ఆలోచనల నుండి కాకుండా మానవతా దృక్పథంతో చూస్తే... నేటికీ దేశంలో ఆదివాసీ గిరిజనులు బతుకులీడుస్తున్న అత్యంత దుర్భర స్థితులు కనబడతాయి. పౌష్టికాహారలోపం, ఆహారధాన్యాల కొరత, ఉపాధి లేమి వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వారు అభివృద్ధికి అమడ దూరంలో వున్నారు. ఆకలి చావులు, దారిద్య్రం గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. రోడ్లు లేక నేటికీ డోలీ మోతతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ అంటేనే సమాజంలో అత్యంత వెనకబడ్డ ఆదివాసీల సంక్షేమానికి, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఉండాలి. 2022-23 బడ్జెట్‌లో రూ.89,265 కోట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదిక చూస్తే బడ్జెట్‌లో 8.6 శాతం వ్యయం కేటాయించాలి. కానీ తాజా అంచనాల ప్రకారం కేవలం 0.02 శాతం మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్‌లో ప్రజా పంపిణీశాఖ ద్వారా గిరిజనులకు రూ.12,683 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.9152 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆహార సబ్సిడీని రూ.80 వేల కోట్లు మేర తగ్గించారు. దీన్నిబట్టి గిరిజనుల పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎంత వివక్షత, నిర్లక్ష్యం అవలంభిస్తుందో అర్ధమౌతుంది. కరోనా కారణంగా దేశవ్యాపితంగా పట్టణాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఆదివాసీ గిరిజనులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కరోనా విజృంభణ ఉన్నా ఉపాధి కోసం గ్రామాల్లో పనుల్లేక మళ్లీ పట్టణాలకు వలసలు వెళ్తున్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసేందుకు కొత్తగా లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వారందరికీ ఉపాధి కల్పించేందుకు బడ్జెట్‌లో నిధులు పెంచకపోగా తగ్గించడం దుర్మార్గం. ఉపాధిహామీ పథకంలో ఉపాధికి గతేడాది రూ.12,705 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.11,427 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. ఇది ఉపాధి కూలీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉపాధి కూలీలు 25 శాతం పని దినాలు కోల్పోనున్నారు.
గిరిజన విద్య అస్తవ్యస్థంగా మారింది. అక్షరాస్యతలో దేశ సగటు 77 శాతం ఉండగా గిరిజనుల్లో 59 శాతం మించడం లేదు. 45 శాతానికి పైగా గిరిజన గ్రామాల్లో పాఠశాలలకు స్వంత భవనాలు, ఉపాధ్యాయులు లేరు. స్కూళ్లు మూతబడుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యతా రంగంలో గిరిజన విద్యకు రూ.6093 కోట్లు మాత్రమే కేటాయించింది. బిజెపి అధికారం లోకి వచ్చిన నాటి నుండి ఉన్నత విద్యా రంగంలో ఎస్.సి, ఎస్.టి విద్యార్థుల ఎదుగుదలను వ్యతిరేకిస్తూ వచ్చింది. గిరిజన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులను పెంచడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు ఇచ్చారు. వీటికి గత బడ్జెట్‌లో రూ.53.80 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ తర్వాత రూ.13.37 కోట్లకు పడిపోయింది. ఈ నిధులతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎలా సాధ్యమో కేంద్రమే చెప్పాలి? ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులో స్పష్టత లేదు. కరోనా కాలంలో ఆన్‌లైన్ పాఠాలు చెప్పారు. కానీ గిరిజన ప్రాంతాల్లో నేటికి సెల్‌ఫోన్, కరెంటు లేని గ్రామాలున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్ముతున్నట్లే, అడవులను కూడా ప్రైవేట్‌పరం చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో ఆదివాసీ గిరిజనులకు అటవీ భూములు, సహజ వనరులే జీవనాధారం. కానీ ఆ భూముల నుండే గిరిజనులను గెంటివేస్తున్నారు. జంతు సంరక్షణ సాకుతో 10 లక్షల మంది గిరిజనులను అడవి నుండి గెంటేయాలని చూస్తున్నారు. అంటే జంతువులకు వుండే హక్కు కూడా గిరిజనులకు లేదన్నమాట. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై కనీస మద్దతు ధర లేదు. అడవులు, భూములను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయడం దుర్మార్గం. అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006ను అమలు చేసి 10 లక్షల గిరిజన కుటుంబాలకు హక్కులు ఇవ్వాల్సిన దానికి మాత్రం బడ్జెట్‌లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రతిపాదనలకు మాత్రం ఏకంగా రూ.165 కోట్లు కేటాయించింది. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాల్లో పచ్చని అటవీ భూములన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి కార్పొరేట్ శక్తులకు ఆదాయం పెంచే విధానాలు చేపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలో ఆదివాసీ గిరిజన రైతాంగం 65 శాతంగా ఉన్నారు. 2022 బడ్జెట్‌లో డ్రోన్ల ద్వారా వ్యవసాయం (కిసాన్ డ్రోన్లు) అంటూ కొత్త పేర్లు పెట్టింది. నిజానికి గిరిజన ప్రాంతాల్లో నేటికీ పోడు వ్యవసాయం ద్వారానే జీవనం గడుపుతున్నారు. రైతులకు గతేడాది ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సబ్సిడీలలో ఈ ఏడాది రూ.4 వేల కోట్లు కోత పెట్టారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.
వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ ప్రతిపాదన ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది సులభతరమని కేంద్రం వాదిస్తోంది. కాని ఇది గిరిజనులకు మరో ప్రమాదకరమైన సంకేతం. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు 1/70, పీసా చట్టం వంటి ప్రత్యేక హక్కులున్నాయి. ఈ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములను బదలాయించడం నిషేధం. అటువంటి పరిస్థితుల్లో ఒకే రిజిస్ట్రేషన్ పాలసీ ద్వారా వాటిని ఉల్లంఘించవచ్చు. అలా జరిగితే గిరిజనులకు తీవ్ర నష్టం కలుగుతుంది. బడా బాబులకు, బినామీలకు సులభతరం. అందుకే 2022 బడ్జెట్ ఏ విధంగా చూసినా కార్పొరేట్లకు అమృతాన్ని అందించేది గానూ, గిరిజనుల జీవితాలు మరింత దుర్భర స్థితికి నెట్టే విధంగాను వుంది.
/ వ్యాసకర్త సెల్ : 9494076092 /
దాస్ వంతాల











