ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టనున్న అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2022ను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స విజ్ఞప్తిచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గురువారం నుంచి శనివారం వరకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.రామకృష్ణ అధ్యక్షతన జరుగుతున్న గిరిజన సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. 2022 సవరణ బిల్లు అమలైతే గిరిజన ప్రాంతంలో లక్షలాది మంది గిరిజనులు అడవి నుండి గెంటేయబడతారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపూలేకుండా పోతుందన్నారు. అటవీ హక్కుల పత్రాలు పొందే వేలాదిమంది హక్కు పత్రాలు పొందే అవకాశమే కోల్పోతారని తెలిపారు. పీసా, 1/70 చట్టం నిర్వీర్యమవుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సవరణ బిల్లును వైసిపి, టిడిపి ఎంపీలు పూర్తిగా వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.తిరుపతిరావు, కె.సురేంద్ర, రాష్ట్ర సహయ కార్యదర్శి కిముడు చిన్నంనాయుడు, విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షులు ఉల్లి బొంజుబాబుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.










