కేరళలో లోని అధిక వేతనాల కారణంగా సుదూర ప్రాంతాలైన అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల నుంచి వలస కార్మికులు భారీగా వచ్చారని సామాజిక-ఆర్థిక, పర్యావరణ అధ్యయన కేంద్రం నిర్వహించిన సర్వే చెప్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. వీటిలో కొన్ని రాష్ట్రాలు 'పరిశ్రమల-స్నేహపూరిత' రాజకీయ వాతావరణానికి, విధానాలకు ప్రసిద్ధి గాంచాయి. అధిక వేతనం కార్మికులకు ఆకర్షిస్తుందన్నది స్పష్టం. కానీ పెట్టుబడిదారులకు అది ఒక నిరోధకం.
కేరళ వామపక్ష రాజకీయాలు... పారిశ్రామికీకరణ పట్ల ఊహాజనిత విముఖత... తిరిగి వార్తలలోకి వచ్చాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోకెల్లా రెండవ పెద్ద సంస్థ కీటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్....రూ. 3,500 కోట్లు విలువ చేసే పెట్టుబడి ప్రణాళికను కేరళ నుండి ఉపసంహరించుకోవాలనే నిర్ణయం ఈ వార్తలకు కారణం. ఆ కంపెనీ కేరళ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకుంది. కేరళలో రాజకీయ వాతావరణం తమ వాణిజ్యానికి అనుకూలంగా లేదని ఆరోపిస్తోంది.
వామపక్ష పార్టీలకు కేరళ బలమైన కేంద్రం. పెట్టుబడిదారుల పట్ల కమ్యూనిస్టుల వ్యతిరేకత ఈ ప్రతిష్టంబనకు కారణమని అనేక మంది భావిస్తున్నారు. కేరళ పెట్టుబడి విధానంలోని లోపాలు, కేరళ ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం గురించి స్థానిక ప్రసార మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య సూచిక ఆధారంగా, కేరళ 28వ స్థానంలో ఉండగా తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రెండు దక్షిణాది రాష్ట్రాలను ఈ విధంగా పోల్చినప్పుడు తప్పనిసరిగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. నీతి ఆయోగ్ తాజా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక ప్రకారం కేరళ మొదటి ర్యాంక్ సాధించింది. అయినప్పటికీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు కేరళను ఎందుకని ఎంచుకోవడం లేదు? వామపక్ష రాజకీయ సిద్ధాంతం కాకుండా మరేదైనా కారణముందా? ప్రభుత్వ విధానాల వల్లే కేరళ పరిశ్రమలను ఆకట్టుకోలేకపోతుందా ?
గత సెన్సస్ ప్రకారం 3.5 కోట్ల జనాభాతో కేరళ రాష్ట్రం 38,863 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి పరిమితమై ఉంది. తెలంగాణలో కూడా సుమారుగా అంతే జనాభా ఉంది. కానీ ఆ రాష్ట్రం దక్షిణ పీఠభూమిలో 1,12,077 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. గణాంకాలను పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రం కన్నా కేరళ భూగోళికంగా 3 రెట్లు చిన్నది. కానీ రెండు రాష్ట్రాల్లో జనాభా సుమారుగా సమానంగా ఉంది. కేరళ ఒక ఉత్పత్తి కేంద్రం కావడానికి...జన సాంద్రత, భూమి విలువ చాలా ఎక్కువగా ఉండడం...అడ్డంకిగా వున్నాయనే అంశాన్ని తెలియచేయడానికి ఈ పోలికను ప్రస్తావించాను.
భారత దేశ జన సాంద్రత ఒక చదరపు కిలోమీటరుకి 382గా ఉంది. అయితే కేరళలో జన సాంద్రత ఒక చదరపు కిలోమీటరుకి 859గా ఉంది. 'వ్యాపారానికి అనుకూలం'గా ఉన్న ప్రధాన రాష్ట్రాల జనసాంద్రతను పరిశీలించినట్లయితే పెద్ద భూభాగాలతో పాటు తక్కువ జన సాంద్రత ఉండడం ఈ రాష్ట్రాలకు సానుకూలమైన అంశం. ఉదాహరణకు భారత దేశ పారిశ్రామిక కేంద్రమైన గుజరాత్ రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకి 308 మాత్రమే. కేరళలో 30 శాతం భూమి అటవీ ప్రాంతం. అటువంటి ప్రదేశాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించరనే వాస్తవాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
ప్రఖ్యాత జీవావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ ఆధ్వర్యంలో పశ్చిమ కనుమల జీవావరణ నిపుణుల ప్యానెల్ 2011లో నిర్వహించిన అధ్యయనంలో చెప్పినట్టుగా కేరళలో అనేక ప్రాంతాలు జీవావరణపరంగా సున్నితమైనవి. పరిశ్రమలకు అనుకూలించనివి. ఎందుకంటే, అవి పర్యావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి కనుక. అందువల్ల కేరళని ఇతర రాష్ట్రాలతో పోల్చేటప్పుడు కేరళ ప్రత్యేక భౌగోళిక స్వభావాన్ని తప్పక పరిగణనలోనికి తీసుకోవాలి.
భూమి లభించకపోవడం, జనసాంద్రత అధికంగా ఉండడం అనేవి రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేకపోవడానికి ప్రధాన కారణాలు. అయినప్పటికీ, ఇతర అంశాలు కూడా కేరళలో అటువంటి సంస్థలు తక్కువగా ఉండడానికి దోహదం చేశాయి. అనేక మంది పెట్టుబడిదారులు కార్మిక వేతనాల వ్యయం ఎక్కువగా ఉండడాన్ని తీవ్ర సమస్యగా పరిగణిస్తారు. కేరళ విపత్తు తరువాత అవసరాల అంచనా ప్రకారం...2018 ఘోరమైన వరదల తరువాత ఐక్యరాజ్య సమితి నిపుణులు, కేరళ ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 35 లక్షల నైపుణ్యం కలిగిన, నైపుణ్యంలేని వలస కార్మికులు రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో సుమారు పది శాతంగా ఉంటుంది. ఈ అధిక వేతనాలు అధిక వలసలను ప్రోత్సహిస్తున్నాయి.
లేబర్ బ్యూరో, లేబర్, ఉద్యోగిత మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం కేరళలో నైపుణ్యం లేని పురుష కార్మికునికి సగటు వేతనం రూ. 700.70. అయితే జాతీయ సగటు రూ. 286.60. భారత ఉపఖండంలో ఇదే నైపుణ్యం లేని కార్మికులకు చెల్లించే అత్యంత ఎక్కువ వేతనం. 'సులభతర వాణిజ్య సూచిక' ప్రకారం అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో వేతనాలను కేరళతో పోల్చినట్లయితే అత్యంత తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 'సులభతర వాణిజ్య సూచిక' ప్రకారం మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రాల్లో సగటు వేతనాలు అతి తక్కువగా 301.30, రూ. 257.70 గా ఉన్నాయి.
కేరళలో లోని అధిక వేతనాల కారణంగా సుదూర ప్రాంతాలైన అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల నుంచి వలస కార్మికులు భారీగా వచ్చారని సామాజిక-ఆర్థిక, పర్యావరణ అధ్యయన కేంద్రం నిర్వహించిన సర్వే చెప్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటుంది. వీటిలో కొన్ని రాష్ట్రాలు 'పరిశ్రమల-స్నేహపూరిత' రాజకీయ వాతావరణానికి, విధానాలకు ప్రసిద్ధి గాంచాయి. అధిక వేతనం కార్మికులకు ఆకర్షిస్తుందన్నది స్పష్టం. కానీ పెట్టుబడిదారులకు అది ఒక నిరోధకం.
కేరళ రాష్ట్ర అధిక అక్షరాస్యతను సామాజిక అభివృద్ధికి సూచికగా పరిగణించాలి. కానీ ఈ అత్యధిక అక్షరాస్యతే తమకు ప్రమాదం తెచ్చి పెడుతుందని పెట్టుబడిదారులు భావిస్తారు. ఈ ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన ఉంటుందని, తమ హక్కుల కోసం గట్టిగా పోరాడతారని పెట్టుబడిదారులు నమ్మడమే దీనికి కారణం. ఇది గతంలో అనేక కంపెనీలలో యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య ఘర్షణకు దారితీసింది. అదే కొన్ని సందర్భాల్లో కంపెనీల శాశ్వత మూసివేతకు కూడా దారితీసింది. కొన్ని సందర్భాల్లో అతి పెద్ద వ్యాపార సంస్థలు కూడా రాష్ట్రంలోని తమ కార్యకలాపాలను బలవంతంగా మూసివేశాయి.
2001లో ఆదిత్య బిర్లా యాజమాన్యం లోని గ్రాసిమ్ ఇండిస్టీస్ లిమిటెడ్ శాశ్వత మూసివేత, ఈ రాజకీయ క్రియాశీలతకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగుల హక్కులను ఉల్లఘించడంతో పాటు పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజలు అనేక సంవత్సరాలపాటు పోరాటం చేసినందున కంపెనీ మూసివేయబడింది. అదే విధంగా కీటెక్స్ గార్మెంట్స్ తయారీ యూనిట్ల పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు అనేక పోరాటాలు చేసారు. కంపెనీ తన
ఉద్యోగులకు కనీస వేతనాలను ఉల్లంఘించినందుకు కేరళ హైకోర్టులో కేసును ఎదుర్కొంటోంది. కార్మికుల రాజకీయ సమీకరణలు పెట్టుబడిదారులను దుర్బలులను చేస్తాయనేది కాదనలేని సత్యం.
దేశంలో ప్రతి రాష్ట్రానికి తనకంటూ ప్రత్యేకమైన వనరులు, లక్షణాలు వున్నాయి. కనుక, ఒకే కొలమానాన్ని ఉపయోగించి రాష్ట్రాలను 'పరిశ్రమలకు అనుకూల లేదా ప్రతికూల' రాష్ట్రాలుగా వర్గీకరించడం అశాస్త్రీయమైనది. 'సులభతర వ్యాపార సూచిక'ను పెట్టుబడిదారుల దృక్పథం నుంచి, వారి సౌలభ్యం ఆధారంగా నిర్ణయించకూడదు. జీవావరణ పరంగా చూసినట్లయితే సున్నితమైన అరేబియన్ సముద్ర తీరం, పశ్చిమ కనుమల మధ్య వున్న ఒక చిన్న రాష్ట్రం కేరళ. ఇది పరిశ్రమల కోసం పెద్ద భూభాగాలను కేటాయించలేదు. 'సులభతర వ్యాపారం' అంటే సాగు భూములను లేదా జీవావరణపరంగా సున్నితమైన భూములను పారిశ్రామిక పార్కులుగా మార్చడమే అన్నట్లయితే... కేరళ ఆ ర్యాంకుల జాబితాలో విశిష్టమైన స్థానం కోసం ప్రయత్నం చేయకూడదు. కేరళ అభివృద్ధి ప్రణాళిక నమూనా...తెలంగాణ లేదా గుజరాత్ మాదిరిగా ఉండకూడదు.
(వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్, గీతం యూనివర్సిటీ, హైదరాబాద్)
/'వైర్' సౌజన్యంతో/
డా|| వి.వి. అభిలాష్











