సాలూరురూరల్: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నా, కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల కోసం కడవరకూ పోరాడిన నిస్వార్ధ కమ్యూనిస్టు నాయకుడు కుప్పానాయుడు మాస్టారని పలువురు వక్తలు కొనియాడారు. ఆర్.కుప్పనాయుడు 11వ వర్ధంతి సభ మండలంలోని జీగిరాం జూట్ కార్మికుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. తొలుత కుప్పానాయుడు చిత్రపటానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, జ్యూట్ కార్మిక సంఘం నాయకులు సింహాచలం, శ్రీనివాస్ పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంటలో నివాసం ఉండి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యలపైనా, మెంటాడ గిరిజన ప్రాంత సమస్యలపైనా, ఆండ్ర రిజర్వాయర్ నీటి సమస్యపై సుదీర్ఘకాలం పోరాటాలు నడిపారని తెలిపారు. ఆయన జీవితాన్ని పూర్తిగా పేదల కోసమే అంకితం చేసి, వివాహం కూడా చేసుకోకుండా, నిస్వార్ధంగా కష్టజీవుల కోసం పనిచేశారని కొనియాడారు. చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నా, ప్రజా సమస్యలపై నిరంతరం ఆలోచించే మాస్టారుకు నివాళులర్పించమంటే బడుగు బలహీనుల పక్షాన ఆయన ఆశయాలకు తగ్గట్టుగా నేడు ఉన్నటు వంటి కార్యకర్తలు ఆలోచనతో పనిచేయడమే మాస్టర్‌కు మనమిచ్చే మంచి నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూర్యనారాయణ, శ్రీనివాసరావు, చిన్నారావు, కార్మికులు పాల్గొన్నారు.










