తగ్గిపోతున్న సాధారణ ప్రసవాలు
ప్రయివేటులో 62 శాతానికిపైగా గర్భిణులకు సిజేరియన్లే
వ్యాపారమయంగా ప్రసవాల ప్రక్రియ
తణుకు వంటి పట్టణాల్లో ఒక్కో ప్రసవానికి రూ.లక్ష వరకూ వసూలు
సిజేరియన్లతో చిన్న వయస్సులో అనేక అనారోగ్య సమస్యలు
సాధారణ ప్రసవాలపై దృష్టి సారించని ప్రభుత్వాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
మనిషి పుట్టుకను కూడా ప్రయివేటు ఆసుపత్రులు వ్యాపారమయంగా మార్చేశాయి. సాధారణ ప్రసవాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్, ప్రయివేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల తీరే దీనికి నిదర్శనం. ధనార్జనే లక్ష్యంగా పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు (ఆపరేషన్లు) చేస్తున్న దుస్థితి నెలకొంది. సాధారణ ప్రసవాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆపరేషన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బిడ్డం అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను అలవోకగా చేస్తూ సొమ్ము దండుకుంటున్నారు. ఆపరేషన్లతో ప్రసవాలు చేసుకుంటున్న గర్భిణులు తర్వాత క్రమంలో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. గడిచిన పది నెలల్లో ఏలూరు జిల్లాలో 17,327 ప్రసవాలు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనిలో ప్రయివేటు ఆసుపత్రుల్లో 8,863 ప్రసవాలు జరగ్గా వీటిలో 6,046 సిజేరియన్ (ఆపరేషన్) ప్రసవాలు జరిగాయి. దాదాపు 62 శాతం గర్భిణులకు ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేసిన పరిస్థితి నెలకొంది. విభజిత పశ్చిమగోదావరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. సిజేరియన్ ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లో తక్కువగా ఉండగా ప్రయివేటు ఆసుపత్రుల్లో మాత్రం పెద్దసంఖ్యలో చేస్తున్నట్లు లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. అమ్మ కడుపును అడ్డంగా కోసేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వ్యాపారమయంగా ప్రసవాల ప్రక్రియ
ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్దతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గర్భం దాలిస్తే ఆపరేషన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. సాధారణ ప్రసవాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రయివేటు ఆసుత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసవాల ప్రక్రియను ప్రయివేటు ఆసుపత్రులు వ్యాపార ధోరణితో చూస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. గర్భం దాల్చిన నాటి నుంచి గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి పలు ప్రయివేటు ఆసుపత్రులు ఇబ్బడిముబ్బడిగా దోచేస్తున్న పరిస్థితి నెలకొంది. గర్భం దాల్చిన రెండో నెల నుంచి స్కానింగ్‌లు, అవసరం లేకపోయినా అనేక టెస్టుల పేరుతో రూ.వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇవికాకుండా ఆపరేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. తణుకు, భీమవరం వంటి పట్టణాల్లో ఒక్కో ప్రసవానికి దాదాపు రూ.లక్ష వరకూ ఖర్చవుతుండగా ఏలూరు, తాడేపల్లిగూడెం వంటి పలు పట్టణాల్లో రూ.50 వేల వరకూ ఖర్చవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లో ఆడ పిల్ల గర్భం దాలిస్తే ఖర్చుల కోసం భయపడే పరిస్థితులు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా బెడ్స్ లేకపోవడం, వసతులు తక్కువగా ఉండటం వంటి అనేక కారణాలు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేసరికి రూ.లక్షా 50 వేలు వరకూ ఖర్చు పెట్టాల్సిన భయంకరమైన పరిస్థితులు సాగుతున్నాయి. అవసరమైతే తప్ప సిజేరియన్లు చేయకుండా కట్టడి చేయడంలో ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయివేటు ఆసుపత్రులు ఇష్టానుసారం రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తేనే గర్భిణులకు కడుపు కోత తప్పుతుందని చెప్పొచ్చు. లేకపోతే ముందుముందు నూటికి నూరుశాతం సిజేరియన్ ప్రసవాలు చేసే ప్రమాదం ఏర్పడనుంది. ఆపరేషన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు మహిళలు చెబుతున్నారు.










