Nov 05,2023 23:12

బూర్జ పిఎసిఎస్‌లో ఫైళ్లను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌ ఫొటో)

* బూర్జ పిఎసిఎస్‌లో రైతుల సొమ్ము మాయంపై విచారణ
* రైతులను పిలిచి మాట్లాడుతున్న అధికారులు
* రంగంలోకి దిగిన సొసైటీ పెద్ద మనిషి
* సొమ్ములు తీసుకున్నట్లుగా సంతకాలు చేయించేందుకు యత్నం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, బూర్జ : బూర్జ పిఎసిఎస్‌లో వెలుగు చూసిన అక్రమాల డొంక కదులుతోంది. ప్రాథమిక సహకార పరపతి సంఘంలో అధిక మొత్తంలో సొమ్ము మాయం కావడంపై సహకారశాఖ అధికారులు విచారణ చేపట్టారు. రైతులను పిలిపించి మాట్లాడారు. రైతులు తీసుకున్న అప్పు, వాయిదా సొమ్ము వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు సొసైటీ పెద్ద మనిషి రంగంలోకి దిగారు. పిఎసిఎస్‌కు సొమ్ములు బకాయి పడినట్లు రైతులతో బలవంతంగా సంతకాలు చేయించుకునేందుకు తెర తీశారు. దీనిపై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

    బూర్జ పిఎసిఎస్‌ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. రైతులకు చెందిన లక్షలాది రూపాయలను అక్రమార్కులు స్వాహా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై ప్రజాశక్తి జిల్లా సంచికలో గత నెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై అధికార యంత్రాంగం మరోసారి విచారణ మొదలుపెట్టింది. రికార్డులు, ఫైళ్ల పరిశీలన చేపట్టింది. దీంతో ఉలిక్కిపడిన అక్రమార్కులు కొత్త పన్నాగానికి తెర తీశారు. రైతులను సొసైటీకి పిలిపించి వారు సొమ్ములు బకాయి పడినట్లు సంతకాలు చేయిస్తున్నారు. ఇప్పటికే వాయిదా సొమ్ము చెల్లించిన రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము ఎన్నిసార్లు డబ్బులు చెల్లించాలంటూ సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. డబ్బులు చెల్లించబోమంటూ కరాఖండిగా చెప్తున్నారు.
రంగంలోకి దిగిన సొసైటీ పెద్ద మనిషి
బూర్జ పిఎసిఎస్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై అధికార యంత్రాంగం కదిలింది. శ్రీకాకుళం సబ్‌ డివిజనల్‌ అధికారి చంటిబాబు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.భూషణరావు విచారణ చేపడుతున్నారు. రైతులను కార్యాలయానికి పిలిచి, వారు చెప్పిన వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు సూత్రధారిగా ఉన్న సొసైటీ పెద్ద మనిషి రంగంలోకి దిగినట్లు తెలిసింది. రైతులు తాము అప్పుగా తీసుకున్న సొమ్ము, పలు సందర్భాల్లో చెల్లించిన వాయిదా సొమ్ముల వివరాలను అధికారులకు వివరించారు. తాము సొసైటీకి చెల్లించాల్సిందేమీ లేదని, తమ పేరును అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారని రైతులు అధికారుల ముందు వాపోయారు. దీంతో కంగుతిన్న సొసైటీ పెద్ద మనిషి మీరు సగం చెల్లించండి, సొసైటీ మిగతా సొమ్ము కట్టేస్తుందంటూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. డబ్బులు పూర్తిగా చెల్లించినా, ఆ సగం సొమ్ము తామెందుకు చెల్లించాలంటూ రైతులు నిలదీస్తున్నారు. తాము డబ్బులు చెల్లించబోమని చెప్పి కార్యాలయం నుంచి వచ్చేస్తునట్లు తెలుస్తోంది.
డబ్బులు కట్టేందుకు అంగీకరిస్తున్న సిబ్బంది
తాము తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించినా నోటీసులు పంపారంటూ అల్లెన గ్రామానికి చెందిన రైతు బాల చంద్రమౌళీశ్వరరావు విచారణ అధికారులకు చెప్పారు. దీనిపై అక్కడ ఉన్న సిబ్బంది రూ.40 వేలు తాము కట్టేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన జడ్డు అప్పమ్మ రుణం తీసుకోకపోయినా, వారి కుమారులను పిలిచి డబ్బులు కట్టాలని పిఎసిఎస్‌ సిబ్బంది అడిగినట్లు తెలిసింది. అప్పు ఎవరు తీసుకున్నారని, తామెందుకు చెల్లించాలంటూ ఎదురుతిరగడంతో సొసైటీ పెద్ద మనిషి, సిబ్బంది తాము రూ.ఏడు వేలు చెల్లిస్తామని, మిగిలిన సొమ్ము మీరు చెల్లించాలంటూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. అప్పు సొమ్ముతో తమకు సంబంధం లేదంటూ వారు వెనుదిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది.
నిలదీస్తే నీళ్లు నమలుతున్న సిబ్బంది
బూర్జ మండల కేంద్రంలోని శ్రీమన్నారాయణ గ్రూపునకు చెందిన పది మంది రైతులు పంట ఖర్చుల కోసం 2020లో రూ.రెండు లక్షల అప్పు తీసుకున్నారు. అందులో సిహెచ్‌.కృష్ణమోహన్‌ అనే రైతు రూ.1500 చొప్పున ఏడు వాయిదాలు చెల్లించారు. డబ్బులు చెల్లించలేదని రెండుసార్లు నోటీసులు ఇవ్వడంతో, సొసైటీకి మరో రూ.20 వేలు ఇచ్చారు. ఇప్పుడు సొసైటీకి డబ్బులు చెల్లించాలని పిలిపించి మీరు రూ.69 వేలు బకాయి పడినట్లుగా రికార్డులు చూపించారు. దీనిపై కృష్ణమోహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత సొమ్ము చెల్లించారో చెప్పడంతో, సిబ్బంది నీళ్లు నమిలారు. పిఎసిఎస్‌ వాళ్లు న్యాయం చేస్తారంటూ సొసైటీ పెద్ద సలహా ఇవ్వడంతో ఆయన వెనుదిరిగారు.
అక్రమాలు రుజువైతే చర్యలు
సొసైటీలో రైతులు తీసుకున్న రుణాలు, వారు చెల్లించిన వాయిదాల సొమ్ము వివరాల రికార్డులను పరిశీలిస్తున్నాం. రైతుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నాం. పరిశీలన పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అధికారులు చర్యలు తీసుకుంటారు.
- చంటిబాబు,
సహకార శాఖ సబ్‌ డివిజనల్‌ అధికారి