Oct 22,2023 20:42

మంత్రి బొత్స, వైవి సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే(ఫైల్‌)

ప్రజాశక్తి - జామి : శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పేరు అధిష్టానం ఖరారు చేయడం పట్ల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ఉత్తరాంధ్ర ఇంచార్జీ వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు పేరు ప్రకటించడంతో ఎమ్మెల్యేకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. నియోజకవర్గం ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీనివాసరావును కలసి అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్నటి వరకు టిక్కెట్‌ ఎవరిదో తెలియని డైనమాలో కేడర్‌ సతమతమవుతున్న తరుణంలో అధిష్టానం పేరు ఖరారు చేయడం వైసిపిలో ఉత్కంఠకు తెరపడింది. తొలి నుంచి ఎస్‌.కోట వైసిపి రాజకీయాల్లో గ్రూపుల బెడద ఎక్కువే. ప్రధానంగా ఎమ్మెల్సీగా ఇందుకూరు రఘురాజును జగన్మోహన్‌ రెడ్డి నియమించిన తర్వాత గ్రూపుల గోల పెరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్ళలో కడుబండి సమన్వయం చేసుకోవడంలో కాస్త తడబడినా, అనతి కాలంలోనే ఐదు మండలాల నాయకులు పట్ల అపారమైన పట్టు సాధించారు. ప్రభుత్వం పాలన ప్రజలకు చేరువ చేసుకుంటూ, ప్రజలకు అంటిపెట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యేకు అదే స్థాయిలో ప్రత్యర్థులు సవాళ్లు విసురుతూ, ఆటంకాలు సృష్టించారు. కానీ ఎమ్మెల్యే మాత్రం అధినేత జగన్మోహన్‌ రెడ్డి మన్ననలు పొందుతూ, ముందుకు సాగిపోయారు. ఒక దశలో ఎమ్మెల్యేకు టిక్కెట్‌ ఇస్తే, తాము పని చేయమని మరో వర్గం అధిష్టానం ఎదుట చెప్పడానికి వెనకాడ లేదు. దీంతో కడుబండి కూడా అదే స్థాయిలో కేడర్‌ అభిమానాన్ని చెజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటించడం, ఇది జగన్మోహన్‌ రెడ్డి ఆదేశం అంటూ, పార్టీ సమావేశంలో జిల్లా పెద్దల మధ్య ప్రకటించడం కడుబండి అభిమానులకు ఆనందోత్సవాలలో ముంచేసిన అంశం. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఎస్‌.కోట వైసిపి గ్రూపులకు చెక్‌ పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా గ్రూపులు పక్కన పెట్టి, కడుబండి విజయానికి కలిసి కట్టుగా కృషి చేస్తారా..? అంటే చెప్పలేని పరిస్థితి. అధిష్టానం ప్రకటనతో రెండో గ్రూపు పార్టీ వీడడం, లేదా కలిసి పని చేయడం మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడుబండి పేరు ముందుగా ప్రకటించి, గ్రూపులకు కల్లెం వేసినట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్‌.కోట వైసిపి గ్రూపు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి ఉండవలసిందే మరి.