Oct 05,2023 22:13

హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, భార్య మాదవిలత (ఫైల్‌ ఫొటో)

కడప అర్బన్‌ కడపలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కో-ఆపరేటివ్‌ కాలనీలో నివాసం ఉంటూ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు(55) (హెచ్‌సి 1895) సర్వీస్‌ రివాల్వర్‌తో భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. తాను అదే రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో భార్య మాధవిలత(50), కుమార్తెెలు లికిన్య(21), అభిజ్ఞ(16)ను నిద్రిస్తున్న సమయంలో రివాల్వర్‌తో కాల్చి చంపినట్లు సంఘటన స్థలంలో చోటుచేసుకున్న దృశ్యాలపు బట్టి తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని డిఎస్‌పి షరీఫ్‌, సిఐలు, ఎస్‌ఐలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. సంఘటన స్థలం పరిశీలించిన అనంతరం డిఎస్‌పి మీడియాతో మాట్లాడుతూ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం రాత్రి 10.30 నుంచి 11 గంటల వరకు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌లో కస్టోడియన్‌, రైటర్‌గా పని చేస్తున్నారు. కన్టోడియన్‌ ఆధీనంలో ఆపీసర్స్‌ పిస్టల్స్‌, ప్రాపర్టీస్‌ ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌ను బట్టి తెలు సుందన్నారు. రెండవ భార్య, కుమారుడికి బెనిఫిట్స్‌ చెందాలని నోట్‌లోరాసి ఉందన్నారు. నోట్‌ బట్టి చూస్తే కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. దర్యాప్తులో అన్నివిషయాలు బటయటకు వస్తాయని చెప్పారు. ఆయన సొంత ఊరు పులివెందుల అన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆత్మహత్య కారణాలను వెలికితీస్తాం : ఎస్‌పి
హెడ్‌ కానిస్టేబుల్‌ భార్యా, బిడ్డల్ని కాల్చి చంపి, తానూ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కారణాలను పోలీస్‌ విచారణలో వెలికితీస్తామని ఎస్‌పి సిద్థార్థ్‌ కౌశల్‌ తెలిపారు. రిమ్స్‌ మార్చురీలో ఉన్న మృతదేహాలను ఎస్‌పి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణం ఆర్థిక సమస్యలా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనే వాటిపై విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు.
మృతదేహాలను సందర్శించి డిప్యూటీ సిఎం, మేయర్‌
హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న విషయం తెసుకున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాష, మేయర్‌ సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర్లను బొట్టు స్వామి అని తాము పిలిచేవారని పేర్కొన్నారు. ఆత్మహత్య బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అతను చాలా మంచివాడన్నారు.