ఆర్‌టిసి బస్టాండ్‌లోకి చేరిన వర్షపు నీరు
ఇబ్బందులుపడ్డ ప్రజలు, వాహనదారులు
ప్రజాశక్తి-కడప సిటీ/చాపాడు
కడపలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఆర్‌టిసి బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, కోర్డు రోడ్డు, భరత్‌నగర్, చెన్నరు రోడ్డు, మృత్యుంజయకుంట, గంజి కుంట కాలనీ, అక్కాయపల్లె, ప్రకాష్‌నగర్, తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. వాహనాదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాల్లోతు వరకు వర్షపునీటితో వాహనాలు మొరాయిం చాయి. కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్లు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అక్కాయపల్లెలోని పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు నగర పాలక అధికారులు యుద్ధప్రాతిపధిక చర్యలు చేపట్టారు.
మైదుకూరులో రోడ్లన్నీ జలమయం
మైదుకూరులో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేని వర్షంతో రోడ్లన్ని జలమయమైయ్యాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్ల పైన నీరు పోంగి ప్రవహించింది. నంద్యాల రోడ్డు, కడప రోడ్డులో భారీగా నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో ఎక్కడ చూసిన నీరు అధికంగా కనిపించినది. మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుని డ్రెయినేజీ వ్యవస్థను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే వర్షం వచ్చిన ప్రతిసారీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు పేర్కోంటున్నారు. పట్టణంలో వర్షంతో రోడ్లపై నిలిచిన నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర నీటి తోలగింపుకు తాత్కాలిక చర్యలు చేపట్టారు. నంద్యాల రోడ్డులో డ్రెయినేజీ వ్యవస్థను దగ్గరుండి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులతో వర్షంలోనే పూడికతీత పనులు చేయించారు. రోడ్లపై నిలిచిన నీరు తోలగిపోయినది. డ్రెయినేజీ సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.










