Jul 28,2023 21:03

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

కడప అర్బన్‌ : జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈ నెల 31న కలెక్టరేట్‌ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. శుక్రవారం పాత బస్టాండ్‌లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ( సెయిల్‌) నుంచి తప్పుడు నివేదిక తెప్పించుకుని, కడప ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని ప్రకటన చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్న రాష్ట్ర ఎంపీలు దీనిపై ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడం లాభదాయకం కాదని చెప్పడం, మరోవైపు కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం ప్రయివేట్‌ జిందాల్‌ కంపెనీకి అప్పగించడం ఎలా లాభదాయకమవుతుందని ప్రశ్నించారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలోని, రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటులో ప్రకటించిన కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా బిజెపి రాయలసీమ కరువు ప్రాంతమైన కడప జిల్లాకు ద్రోహం చేసిందన్నారు. ఈ ప్రకటనకు నాలుగు రోజుల ముందు కర్నూల్‌, కడపలో రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి కర్నూలు రాయలసీమ డిక్లరేషన్‌కు బిజెపి కట్టుబడి ఉందని, కడప ఉక్కు సెయిల్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తామని ఇచ్చిన హామీకి భిన్నంగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటన చేసిందని తెలిపారు. కడప ఉక్కు పై ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్‌లోమరో మాట, రెండు నాలుకల ధోరణిగా బిజెపి వ్యవహ రిస్తుందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కడప కలెక్టరేట్‌ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో జరగబోవు ధర్నాకు జిల్లాలోని ప్రజలు ప్రజాతంత్ర వాదులు, యువత పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ, ఏ.రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎం.పాపిరెడ్డి, వి.అన్వేష్‌, బి.దస్తగిరి రెడ్డి, కె.శ్రీనివాసులు రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, ఓబులేసు, జమీల, రాజామణి, నారాయణరెడ్డి, రామకష్ణారెడ్డి, ఎమ్మార్‌ నాయక్‌, ఉదరు పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : ఈ నెల 31 న కలెక్టరేట్‌ వద్ద కడప ఉక్కు సాధన కోసం నిర్వహించే ధర్నాలో ప్రతిఒక్కరు పాల్గొని జయ ప్రదం చేయాలని సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరణాల శివ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఒ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాయలసీమలో ఉన్న ఖనిజాల విలువ తెలుసుకొని వాటి కోసం అయినా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.
బ్రహ్మంగారిమఠం : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేసిన బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 31న కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సానగోవింద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతోపాటు పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు పరుస్తామని బిజెపి హామీ ఇచ్చి నేడు మరవడం దారుణమని వాపోయారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సునీల్‌ ,అజరు నాయకులు రాహుల్‌, రాజశేఖర్‌, దేవా, అరవింద్‌ పాల్గొన్నారు.