Jul 31,2023 18:51

నిరసనలో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వమే కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. కడప ఉక్కుపై కేంద్రం వైఖరికి నిరసనగా సోమవారం గుంటూరులోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వద్ద నిరసన చేపట్టారు. రామారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కడప ఉక్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన బిజెపి నేడు నిర్మాణానికి అవకాశం లేదని ప్రకటించడం మోసం చేయటమే అన్నారు. విభజన చట్టంలోని హామీలలో భాగంగా రాయలసీమ అభివృద్ధికి కీలకమైన కడప ఉక్కు ప్రాజెక్టు నిర్మాణాన్ని విస్మరించడం తగదన్నారు. విభజన చట్టంలోని హామీలలో భాగంగా రాజధాని నిర్మాణానికి, విశాఖ రైల్వే జోన్‌ నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకులు ఇప్పటికైనా స్పందించి, కేంద్రాన్ని నిలదీయాలని, లేకపోతే ప్రజలు క్షమించరని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా ధారాదత్తం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇ.అప్పారావు, ఎంఎ.చిష్టీ, బి.శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, కె.అజరుకుమార్‌, ఎల్‌.అరుణ, కె.శ్రీనివాస్‌, ఎస్‌.కె.ఖాశిం షహీద్‌, సమీర్‌, ఖాశింవలి పాల్గొన్నారు.