Jan 05,2023 06:43

రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ కడప జిల్లాలో ప్రైవేట్‌ రంగంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి జిందాల్‌ గ్రూపు సంస్థ అయిన జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ (జెఎస్‌డబ్ల్యు) స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను 3295 ఎకరాల్లో జమ్మలమడుగు మండలం సున్నపు రాళ్ళపల్లి వద్ద నిర్మించనున్నారు. జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ ..మొత్తం మూడు దశల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. మొదటి దశలో రూ.3,300 కోట్లతో ఒక మిలియన్‌ టన్ను చొప్పున మొత్తం మూడు మిలియన్‌ టన్నుల సామర్ధ్య స్థాపిత శక్తితో ప్లాంట్‌ను పూర్తి చేస్తామని ఈ సంస్థ హామీ ఇచ్చింది. మొత్తం మూడు మిలియన్‌ టన్నుల ప్లాంట్‌ వల్ల సుమారు 6500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జనవరిలోనే ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రభుత్వ రంగంలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగాలని దీర్ఘకాలంగా రాయలసీమ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్‌ విభజన చట్టం-2014లోని 13వ షెడ్యూల్‌లో ఆంధ్రరాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడుతుందని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. వీటన్నింటికి తిలోదకాలిచ్చి నేడు రాష్ట్ర ప్రభుత్వం జిందాల్‌ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది. పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం ఎపి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని ఉల్లంఘించటం వల్లె జెఎస్‌డబ్ల్యుతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొనడం రాయలసీమ ప్రజలకు తీవ్ర హానిచేయడమే.
దశాబ్ధిన్నర కాలం నుండి రకరకాల పరిణామాలతో నేడు కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం, నిర్వహణ జెఎస్‌డబ్య్లు పరమైంది. ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ పరిశ్రమ ఒక్క అడుగూ ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మరొకసారి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది కూడా ఆచరణలోకి వస్తుందా? లేదా? వేచి చూడాల్సి ఉంది. తొలుత 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 20మిలియన్‌ టన్నుల సామర్ధ్యం స్టీల్‌ప్లాంట్‌కు పునాది రాయి వేశారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి రూ.20వేల కోట్ల పెట్టుబడి బ్రాహ్మణిస్టీల్‌ పరిశ్రమ యాజమాన్యం పెడుతుందని చెప్పారు. కానీ ఇది ఆచరణకు నోచుకోలేదు. పైగా పరిశ్రమ నిర్మాణం చేపట్టక పోగా దీనికి ఓబులాపురం వద్ద కేటాయించిన గనుల నుండి ముడి ఇనుమును గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులు కొల్లగొట్టి.. కోట్ల టన్నులు విదేశాలకు ఎగుమతి చేసి వేలకోట్ల రూపాయలు లాభాలను ఆర్జించారు.
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు పదవీకాలం చివరిలో రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో మరొక పునాది రాయివేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి 2019 డిసెంబరులో ప్రస్తుత సున్నపురాళ్లపల్లిలోనే ప్రభుత్వ వనరులతోనే స్టీల్‌ప్లాంట్‌ను నిర్మిస్తామని శంకుస్థాపన చేశారు. మూడేళ్ల కాలంలో స్టీల్‌ప్లాంట్‌ను సాకారం చేస్తామని ఇది తన జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుందని, కడప జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల నిజం కాబోతుందని ప్రకటించారు. దీనిని నెలకొల్పడం ద్వారా ఆర్ధిక ఉపాధి రంగాన్ని తిరగరాస్తామని ఇలా... ఎన్నో మాటలన్నారు.
ఈ మాటలన్నీ నీటి మీద రాతలుగా మారిపోయాయి. ప్రభుత్వరంగంలో కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి క్రమేణా తిలోదకాలిచ్చారు. లిబర్టీ స్టీల్‌ గ్రూపుతో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. అది దివాళా తీయడంతో ఎస్సార్‌ స్టీల్‌తో జాయింట్‌ వెంచర్‌ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇలా రకరకాల వాగ్ధానాలతో కాలయాపన చేసుకుంటూ నేడు జెఎస్‌డబ్య్లు స్టీల్‌కి ధారదాత్తం చేశారు.
పునర్విభజన చట్టం హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కడపలో పెట్టాల్సిన ప్రభుత్వ స్టీల్‌ పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయకుండా ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌తో ఒప్పందం చేసుకోవడం రాయలసీమకే కాక మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే ద్రోహం చేసినట్లయింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా బిజెపితో అధికారం పంచుకొని విభజన చట్టంలో హామీలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కడప స్టీల్‌ప్లాంట్‌ స్థాపనపైన మోడీ ప్రభుత్వం రకరకాల కమిటీలు, టాస్క్‌ఫోర్సులు వేసి తీవ్ర జాప్యం చేసింది. అయినా ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం బిజెపి ఎడల మెతక వైఖరే అవలంభించింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తున్నది. గడిచిన మూడున్నరేళ్లలో కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిచేయకుండా కేవలం విన్నపాలు, విజ్ఞప్తులకే పరిమితమైంది.
ఇటీవల పరిణామాలు చూస్తుంటే... ప్రభుత్వ రంగంలో కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలనే డిమాండ్‌కు ముఖ్యమంత్రి తిలోదకాలి చ్చినట్లు కనిపిస్తున్నది. వారంక్రితం ముఖ్యమంత్రి విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన భేటీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం కనీస ప్రస్తావనే చేయలేదు. పై పెచ్చు జెఎస్‌డబ్య్లు తో కడపలో ఏర్పాటు చేయబోతున్న ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌కి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండిసి) నుండి ముడి ఇనుప ఖనిజం సరఫరాకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అంతేగాక అల్లూరి సీతారామరాజు (పాడేరు) జిల్లా గిరిజన ప్రాంతంలో అదానీ ఏర్పాటు చేయబోతున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అంటే కడప స్టీల్‌ప్లాంట్‌ కన్నా జెఎస్‌డబ్య్లు స్టీల్‌, అదానీ సంస్థలే ముఖ్యమైనవిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
రెండోవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బిజెపిపై పదునుగా వ్యవహరించటంలేదు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ముందుకు రావటంలేదు. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి వద్దకు రాయభారం నడపటానికి కూడా సిద్ధం కావటం లేదు. ఇటీవల నరేంద్రమోడీని విశాఖకు రప్పించి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మెత్తటి మాటలు తప్ప.. స్టీల్‌ప్లాంట్‌ అమ్మితే ఊరుకోబోమని తెగేసి చెప్పలేదు. ముఖ్యమంత్రి తాజా ఢిల్లీ పర్యటనలో కూడా కనీసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ప్రస్తావన కూడా ప్రధాని వద్ద చేయలేదు. పైపెచ్చు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూముల్లో 4 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కేటాయించమని కేంద్రాన్ని కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విధంగా బిజెపి ఎడల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ అవకాశవాద వైఖరి తో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే కాక ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకూ తీవ్ర ప్రమాదం ఏర్పడింది.
ఇప్పుడు ప్రైవేట్‌ జెఎస్‌డబ్య్లు స్టీల్‌ప్లాంట్‌ రాయలసీమ ప్రాంత భవిష్యత్తును మార్చేస్తుందని, గట్టి పారిశ్రామిక పునాది ఏర్పాటయ్యి పెద్దఎత్తున అనుబంధ పరిశ్రమలు నెలకొల్పబడ తాయని, తద్వారా లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్ల వల్ల దేశంలో జరిగిన అభివృద్ధి నామమాత్రమే. విచ్చిలవిడి శ్రామిక దోపిడికి అవి నిలయాలుగా ఉన్నాయి. సహజవనరులు కొల్లగొట్టబడుతున్నాయి.
జె.ఎస్‌.డబ్య్లు స్టీల్‌ అభివృద్ది బాగోతాన్ని పరిశీలిస్తే.. ఈ కంపెనీల వల్ల రేపు కడప ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ప్రైవేట్‌ స్టీల్‌ ఉత్పత్తి కంపెనీల్లో టాటా తరువాత రెండో అతిపెద్ద స్టీల్‌ కంపెనీ ఇది. 2021 -22 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో 19 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసింది. కర్ణాటకలో బళ్లారికి దగ్గరలో తోరణగల్లు వద్ద వున్న ప్లాంట్‌ అతిపెద్దది. దాదాపు 10వేల ఎకరాల్లో ఉంది. 1997లో ఉత్పత్తి ప్రారంభించింది. గతేడాది 12 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసింది. ఇటీవల 18 మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి ఈ కంపెనీని విస్తరించారు. ఈ కంపెనీ వల్ల బళ్లారి, విజయనగర్‌ రీజియన్‌కు జరిగిన అభివృద్ధి చూస్తే చాలా నామమాత్రంగానే ఉంది. ఈ కంపెనీ చుట్టూ ఉన్న 43 గ్రామాలు ఎదుగుబొదుగూ లేకుండా ఉన్నాయి. అత్యధిక మంది కాంట్రాక్టు కార్మికులే. వేతనాలు అత్యంత ఘోరంగా, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో వున్నాయి.
ఉదాహరణకు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ యూనిట్లన్నీ కలిపి లక్షా 46వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించాయి. ఆ ఏడాది మొత్తం కార్మికుల వేతనాలు, పిఎఫ్‌, ఇతర సంక్షేమంపై చేసిన వ్యయం కేవలం 3,493 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మొత్తం టర్నోవర్‌లో కేవలం 2.39శాతం మాత్రమే వేతనాలకు ఖర్చుచేసింది. అలాగే టాటా స్టీల్‌లో కూడా ఇదే పరిస్థితి. గతేడాది టాటాస్టీల్‌ 19 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేసి రూ.1,30,473 కోట్లు టర్నోవర్‌ సాధించింది. వేతనాలకు ఖర్చు చేసింది రూ.6,365 కోట్లు అనగా 4.87 శాతం మాత్రమే.
అదే ప్రభుత్వరంగ స్టీల్‌ప్లాంట్‌ కంపెనీ అయిన స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) లోని వివిధ యూనిట్లలో 62,181 మంది పర్మినెంట్‌, 62,040 మంది కాంట్రాక్టు కార్మికులు మొత్తం 1,24,221 మంది పనిచేస్తున్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 17.73 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తితో లక్షా 3వేల కోట్ల రూపాయలు టర్నోవర్‌ సాధించింది. వేతనాలకు రూ.12,846 కోట్లు చెల్లించింది. అంటే మొత్తం ఆదాయంలో 12.5 శాతం వేతనాలకు ఖర్చు చేసింది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో కూడా ప్రస్తుతం 15వేల మంది పర్మినెంట్‌ కార్మికులతో పాటు మరో 16వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది 5.4 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తితో పాటు 28,215 కోట్ల రూపాయలు టర్నోవర్‌ సాధించింది. మొత్తం ఆదాయంలో 11.16 శాతం వేతనాలపై ఖర్చు చేసింది.
అంతేగాక ప్రభుత్వ పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ల నిర్మాణం జరిగిన చోటల్లా ఆ ప్రాంత అభివృద్ధి కన్పిస్తుంది. ఒరిస్సాలోనిలో రూర్కేలా, చత్తీస్‌ఘడ్‌లో భిలాయి, జార్ఖండ్‌లో బొకారో, పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూర్‌, ఆంధ్రాలో విశాఖపట్నం ..ఇలా అనేక చోట్ల ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ స్టీల్‌ప్లాంట్లు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు రోల్‌మోడల్‌గా నిలిచాయి. దేశంలో ప్రయివేటు స్టీల్‌ప్లాంట్లు ఉన్న ఏ వెనుకబడిన ప్రాంతం కూడా అంతగా అభివృద్ధి కాలేదు.
కనుక ప్రయివేటు కడప స్టీల్‌ప్లాంట్‌ వల్ల ఆ ప్రాంతానికి జరిగే ప్రయోజనం నామమాత్రమే!.జెఎస్‌ డబ్ల్యు స్టీల్‌ రాయలసీమ ప్రాంత భవిష్యత్‌ మార్చేస్తుందని ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నట్లు ఆ ప్రాంత అభివృద్ధి జరగదు. ప్రభుత్వరంగంలో స్టీల్‌ప్లాంట్‌ వస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కల్గించే, ఉన్నతమైన జీవితాలను అందించే వేతనాలు ఉంటాయి. సామాజిక వ్యవస్థలో ఆదాయ పున:పంపిణీ జరుగుతుంది. దీని ఆధారంగా అనుబంధ పరిశ్రమలు, సేవారంగం విస్తరిస్తాయి. ప్రాంతాలు, ప్రజల మధ్య అసమానతలు తగ్గుతాయి. అందువల్ల కడప స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో నిర్మించడం ద్వారానే రాయలసీమ అభివృద్ధికి బాటలు పడతాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మెతక వైఖరిని విడనాడి విభజన చట్టం హామీ అయిన కడప స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలో సత్వరం నిర్మించేందుకు బిజెపి సర్కార్‌పై పోరాటానికి సిద్ధంకావాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడంతోపాటు విభజన చట్టంలోని దుగ్గరాజుపట్నం పోర్టు, విశాఖ రైల్వేజోన్‌ తదితర హామీలన్నీ సాధించేందుకు బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలి. బిజెపితో మెతకవైఖరి అవలంభిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ అవకాశవాద దివాళాకోరు రాజకీయ విధానాన్ని విడనాడి బిజెపి యెడల నికరంగా పోరాడేందుకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలి.

kadapa-steel-plant-situation-in-ap-govts-article-by-gangarao

 

 

- డాll బి.గంగారావు, 9490098792