కడప కడప రైల్వే స్టేషన్‌ను గురువారం ఉదయం గుంతకల్ డిఆర్‌ఎం మనీష్ అగర్వాల్ సందర్శించారు. కడప రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆయన తనిఖీ చేశారు. సీనియర్ సెక్షన్ ఇంజినీర్ విద్యుత్ కార్యాలయాన్ని, అధికారుల విశ్రాంతి గహాన్ని, రైల్వే గూడ్స్ ఆఫీసును తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కడప రైల్వేస్టేషన్ సమీపంలోని భాకరాపేట వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన స్థలాన్ని, గూడ్స్ బ్రేక్ వ్యాన్, డెమో ప్రాంతాలను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. కడప రైల్వేస్టేషన్ సమీపంలోని భాకరాపేట వద్ద ఈనెల 5న గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్ డిఒఎం జి. శ్రావణ్ కుమార్, సీనియర్ డిఇఎన్( కో-ఆర్డినేషన్) అక్కిరెడ్డి, సీనియర్ డిఎస్‌టిఇవైపి సింగ్ ఉన్నారు.
సస్పెన్షన్ ఎత్తివేత..
కడప రైల్వేస్టేషన్ సమీపంలోని భాకరాపేట వద్ద ఈనెల 5న గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.ఎన్. రెడ్డితో సహా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌రెడ్డి, డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ లాల్ బాబు సింగ్, సీనియర్ జిటిఎం ఖాసీం, పాయింట్స్ మెన్ జ్యోతి ప్రతాప్, పాయింట్స్ ఉమెన్ శాంతి ఆరుగురిని బుధవారం సస్పెండ్ చేశారు. అదేరోజు వారిపై విధించిన సస్పెన్షన్ రాత్రి ఎత్తివేశారు. భాకరాపేట వద్ద చోటు చేసుకున్న ఘటనపై విచారణ నిమిత్తం కమిటీని వేసినట్లు తెలుస్తోంది. కమిటీ విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.










