Oct 30,2023 20:16

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేస్తున్న సిఎం జగన్‌

 కడప ప్రతినిధి కడప సమగ్రాభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఆశించిన పురోగతి కొరవడింది. జిల్లా కరువుకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల్లోనూ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. 2017లో వరదల్లో గల్లంతైన ఎల్‌ఎస్‌పి గేట్ల సాక్షిగా మిగిలిన 12 ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి కనిపించలేదు. మహానగరాలకే పరిమితమైన ఆర్కిటెక్షర్‌ యూనివర్శిటీని కడప గడపలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితమైంది. టిడిపి ప్రభుత్వం జిల్లాను హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తామన్న వాగ్దానం నీటి మూటను తలపిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మూడున్నరేళ్లలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అందని ద్రాక్ష పుల్లన సామెత చందంగా మారింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎండగట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 30న కర్నూలు జిల్లాలో మొదలుపెట్టిన ప్రజా రక్షణభేరి యాత్ర మంగళవారం సాయంత్రానికి మైదుకూరుకు చేరుకోనుంది. అనంతరం బద్వేల్‌ మీదుగా కడప, ఎర్రగుంట్ల ప్రాంతాల మీదుగా బస్సుయాత్ర సాగనుంది.
సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని గండికోట, సర్వరాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు ఎప్పటికీ సాగులోకి వస్తుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రాజెక్టు పనుల పూర్తికి నిధుల కేటాయింపులు చేయకపోవడంతో మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి చందంగా మారింది. రూ.212 కోట్లతో కూడిన సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు రివిట్‌మెంట్‌ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్యాకేజీ-1, 2 పనులు చేసిన అవెక్సా కంపెనీకి రూ.150 కోట్ల బిల్లులు చెల్లింపులు చేయకపోవడంతో సర్వరాయసాగర్‌ రివిట్‌మెంట్‌ పనులు అడుగుముందుకు పడడం లేదని సమాచారం. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌, ఎగువసగిలేరు, దిగువ సగిలేరు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి నెలకొంది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మంసాగర్‌ లీకేజీ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఫలితంగా 17 టిఎంసిలను పూర్తిస్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా 1.78 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. పొరుగునున్న ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. ఫలితంగా పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లోని ఐదు వేల ఎకరాల ఆయకట్టు సాగు కొలిక్కి రావడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ 25 శాతంలోపు పనులు చేసిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన మూడవది మినహా మిగిలిన ఆరు ప్యాకేజీలను రద్దు చేసింది.
కడప జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర విభజన హక్కు పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కేంద్రంలోని బిజెపి సర్కారు ఉద్దేశపూర్వకంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీని తొక్కి పెట్టింది. 2017లో ప్రతి పక్ష నేత హాదాలో చేపట్టిన పాదయాత్రలో మూడున్నరేళ్లలో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలు నీరోడుతున్నాయి. కేంద్రలోని బిజెపి సర్కారు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలనే నిబంధనల్ని తుంగలో తొక్కింది.
రూ.376 కోట్లతో కూడిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ, కేన్సర్‌ కేర్‌, సైక్రియాటిక్‌ ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయడం, ఏర్పాటు చేస్తామని హామీ ఊరట కలిగించడం మినహా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. మైదుకూరు నియోజకవర్గంలో అరుదైన పంటగా గుర్తింపు పొందిన కెపి ఉల్లి, పసుపు సాగు ప్రశ్నార్థకంగా మారింది. కెపిఉల్లి ఉత్పత్తుల నిల్వకు కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం మద్దతు ధర కల్పనపై నిర్లక్ష్యం మేటలు మేసింది. బద్వేల్‌కు సోమశిల రిజర్వాయర్‌ నుంచి తాగునీటి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎప్పటికి సాకారమవుతాయో తెలియడం లేదు.
నేడు మైదుకూరు, బద్వేల్‌, కడపలో బహిరంగ సభలు
సిపిఎం నేతలు ఎం.ఎ.గఫూర్‌, ప్రభాకర్‌రెడ్డి రాక
ప్రజా రక్షణభేరి పేరిట సిపిఎం ఆధ్వర్యంలో తలపెట్టిన బస్సు యాత్ర మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి మైదుకూరు పట్టణానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి బద్వేల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం కడపలో తలపెట్టిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకోనుంది. జిల్లాలోని మైదుకూరు, బద్వేల్‌, కడప పట్టణాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణయ్య, ఉమామహేశ్వరరావు హాజరుకానున్నారు. మధ్యాహ్నానంతరం యర్రగుంట్ల మీదుగా అనంతపురం జిల్లాలో అడుగుపెట్టనుంది.