Sep 08,2023 21:58

మాధవి

కడప అర్బన్‌ : అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబునాయుడు దష్టి సారించారు. జనసేనతో సంబంధం లేకుండా తన వాళ్లను నిలబెట్టేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఇన్‌ ఛార్జులను నియమిస్తూ టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చె న్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. కడప ఇన్‌ఛార్జిగా ఆర్‌.మాధవిరెడ్డి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ బి.రామాంజనేయులను నియ మించడం విశేషం. చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కడప ఇన్‌ఛార్జిగా మాధవి నియామకం చర్చనీ యాంశమైంది. కడప పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి ఆర్‌.శ్రీనివాస రెడ్డి, సతీమణి మాధవిని కడప అసెంబ్లీ బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం గమనార్హం. శ్రీనివాస రెడ్డి తండ్రి ఆర్‌.రాజగోపాల్‌రెడ్డి గతంలో మంత్రిగా పని చేశారు. వైఎఎస్‌ఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగా కడపలో రాజకీయం నడిపారు. గతంలో కడప పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పోటీ చేసి వైఎస్‌ఆర్‌ కుటుంబానికి ఎదురొడ్డారు. మరోసారి కూడా ఆయన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన భార్య మాధవికి కడప అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఆయన ఒత్తిడి తెచ్చారు. మరోవైపు వైసిపి మాత్రం ముస్లిం మైనార్టీకి టికెట్‌ను ఖరారు చేసింది. కడప నుంచి అంజాద్‌బాషా రెండుసార్లు గెలుపొందారు. రెండోసారి వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చోటు దక్కించుకున్నారు. మూడోసారి కూడా ఆయనే బరిలో ఉండనున్నారు. రానున్న ఎన్నికల్లో అంజాద్‌బాష, మాధవీరెడ్డి మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కడప టికెట్‌ను టిడిపి ఏకైక కార్పొరేటర్‌ ఉమాదేవి ఆశించారు. అయితే టిడిపి అధిష్టానం మాత్రం మాధవి వైపు మొగ్గు చూపడం గమనార్హం.
టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు..
టిడిపి కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా రెడ్డప్ప గారి మాధవి రెడ్డిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జిని నియమించినట్లు ఉత్తర్వుల్లో తెలియజేశారు.