
అక్రమ అరెస్టులపై హోరెత్తిన నిరసనలు
ఆందోళనలకు సిపిఎం మద్దతు
నిరసనను అడ్డుకున్న పోలీసులు
పలువురు అరెస్టు, విడుదల
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు తలపెట్టిన మహాధర్నాను ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపి అణచివేయాలని ప్రయత్నించింది. అందుకు నిరరసనగా సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ చర్యలకు ఆగ్రహించిన అంగన్వాడీలు కదంతొక్కారు. నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగనానికి చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, సహాయకులు సమస్యలు పరిష్కరించామంటే అరెస్టు చేయడం సిగ్గు సిగ్గు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటి అమలు చేయాలని, నాణ్యమైన ఆహార పదార్థాలను సరఫరా చేయాలని, హెల్పర్లకు, మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని పెద్దఎత్తున నినాదాలు చేసుకుంటా మదనపల్లి, చిత్తూరు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీనివల్ల ట్రాఫిక్ స్తంభించింది. మదనపల్లి డిఎస్‌పి కేశప్ప, ఒకటవ పట్టణ సిఐ మహబూబ్ బాషా, ట్రాఫిక్ సిఐ సుధాకర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు ఆందోళన విరామించేది లేదని భీష్మించుకున్నారు. సహనం కోల్పోయిన పోలీసులు సిపిఎం జిల్లా కార్యాదర్శి పి.శ్రీనివాసులును బలవంతంగా లాక్కుని పోలీస్ వాహనం ఎక్కించారు. కోపోద్రికులైన అంగన్వాడీలు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని రాస్తారోకో ఉదృతం చేశారు. డిఎస్‌పి కేశప్ప ఆదేశాలతో శ్రీనివాసులును ఒదిలేశారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు, తరువాత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైసిపి ప్రభుత్వం హామీలిచ్చి మాట తప్పిందని విమర్శించారు. ధర్నాకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారని తెలిపారు. పైపెచ్చు విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడికక్కడ అరెస్టు చేశారని, నిర్భంధించారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్‌లలోకి తీసుకెళ్ళారని తెలిపారు. విజయవాడలో రైల్వేస్టేషన్ నుండి వస్తున్న వందలాది మందిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లు, కల్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. అనేక మంది అంగన్వాడీ యూనియన్ నాయకులను గహ నిర్బంధం చేశారని తెలిపారు. మహిళలనే విచక్షణ కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. రోడ్డునపోయే ప్రజలను బస్‌స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లలో సామాన్య ప్రజల్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు, ఉద్యోగులు, కార్మికుల గొంతునొక్కడం పచ్చి నిరంకుశత్వం తప్ప మరొకటి కాదని వెల్లడించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల కోర్కెలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే వైసిపి ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమన్నారు. అంగన్వాడీ యూనియన్ నాయకులు శ్రీవాణి, లక్ష్మినరసమ్మ, చాంద్ బి, సుభద్ర మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు, మినీవర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, టీచర్లకు ఇచ్చేంత వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తోపాటు వివిధ రకాల యాప్‌లను రద్దుచేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంటు వయసును 62 ఏళ్లకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్రాస్‌ను ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, 2017 నుండి ఇప్పటి వరకూ టిఎ, డిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు సరిపోయేలా కచ్చితమైన కొలతతో ప్రతినెలా 5వ తేదీలోగా సకాలంలో అంగన్‌వాడీ సెంటర్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతే అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉదతం చేస్తామని హేచ్చరించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : ప్రభుత్వం అంగన్వాడీలపై నిరంకుశ వైఖరిని విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ అన్నారు. హక్కుల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎం.ఈశ్వరమ్మ, ఎం.విజయమ్మ, శివరంజని, అమరావతి, ఇందిరమ్మ, సునీత, వనిత, ఇంద్రావతి, మమత, అనురాధ, శ్రీలత పాల్గొన్నారు. రైల్వేకోడూరు : ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఐసిడిఎస్ కార్యాలయం నుండి టోల్‌గేట్ మీదగా అంబేద్కర్ సర్కిల్, వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, పోలీస్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేసి బైఠాయించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్‌ని పోలీసులు అరెస్టు చేసి అనంతరం సొంత పూసికతుపై విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు కోశాధికారి జి.పద్మావతి, వెన్నెల, దుర్గా, ఈశ్వరమ్మ, కుమారి, మాధవి, రోజా, మనేమ్మ, రెడ్డమ్మ, సునీత, నిర్మల, శ్రీదేవి, కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మెనీ వర్కర్లు పాల్గొన్నారు. బి.కొత్తకోట : స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎఐటియుసి తంబళ్ళపల్లి నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సలీం బాషా, వేణు గోపాల్‌రెడ్డి, మండల నాయకులు జి.రఘునాథ్, గంగులప్పా, దుమ్ము బాబు, రియాజ్, హబీబ్, చంద్ర పాల్గొన్నారు. రాయచోటిటౌన్: అంగన్వాడీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిఐటియు, ఎఐటియుసి నాయకులు పేర్కొన్నారు. అంగన్వాడీల అరెస్టును నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అంగ న్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను రెండు రోజుల ముందే ప్రభుత్వం పోలీసుల చేత జల్లెడ పట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామిక చర్య అని ఎఐటియుసి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎ. రామాంజులు, సాంబశివ పేర్కొన్నారు. స్థానిక బంగ్లా వద్ద రెండు సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలంగాణకన్నా అదనంగా జీతాలు పెంచుతామని, నేడు వేతనాలు పెంపులోగాని ప్రమోషన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఐసిడిఎస్‌ను ప్రయివేటీకరణ చేసేందుకు యత్నాలు, దేశంలో ఎనలేని విధంగా నూతన విద్యా విధానం తీసుకురావడం వంటివి బాధాకరమన్నారు. చివరి అసెంబ్లీ సమావేశాలైన వెంటనే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పి ధరలకనుగుణంగా కనీసవేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం బంగ్లా వద్ద పెద్ద ఎత్తున మానవ హారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగ నినాదాలు చేస్తున్న చేశారు. దీంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. సీఐ జోక్యం చేసుకుని ట్రాఫిక్ లేకుండా చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్( సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి. భాగ్య లక్ష్మి, ఖాజాబి, సిద్దమ్మ, నాగమణి, వంగిమళ్ళ రంగారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుదీర్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు సుహాసిని, ఇందిరమ్మ, రాధ, చిట్టెమ్మ, లక్ష్మిదేవమ్మ, ఉషా, సుజాత,రజని, శోభా,శారధ తులసి,భారతి, రత్నా, దుర్గా, రామతులసి పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు.