సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా - జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, ఆయాలు
ప్రజాశక్తి - ఏలూరు
సమస్యల పరిష్కారం కోసం ప్రతీ అంగన్వాడీ కార్యకర్త వీరనారి జాన్సీరాణీలా అలుపెరుగని పోరాటం చేయాలని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక జ్యూట్‌మిల్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్నాకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ హసీనా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన షేక్ సాబ్జీ మాట్లాడుతూ పోరాడితేనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పాదయాత్రలో కనిపించిన ప్రతిఒక్కరికీ ముద్దులు పెట్టిన సిఎం జగన్ నేడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న వాళ్లను బెదిరించడం సిగ్గు చేటన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే సమస్యలు పరిష్కారమౌతాయన్నారు. అప్పటివరకూ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి కేటాయించే మెనూ ఛార్జీలకు చాక్‌లెట్ కూడా రాదన్నారు. పిఆర్‌సి అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులను, పర్మినెంట్ చేస్తామని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసగించిందన్నారు. వ్యక్తిగతంగా 34 కేసులున్న జగన్ సిఎం ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దురదృష్టమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాదారులను నియమించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలపై శాసన మండలిలో గళం విప్పుతామని హామీ ఇచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక అంగన్వాడీలను వివిధ తనిఖీల పేర్లతో వేధించడం సిగ్గు చేటన్నారు. 16 కార్లు వేసుకుని అంగన్వాడీలను సందర్శిస్తున్న పుడ్ కమిషన్ ఛైర్మన్ అంగన్వాడీలను అవమానిస్తే సహించేది లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. పైగా రాజకీయ వేధింపులు పెరిగాయన్నారు. వేయి రూ.వెయ్యి జీతం పెంచి అంగన్వాడీల సంక్షేమానికి ఎసరు పెట్టారన్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టడానికి రైతాంగం చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఫేస్‌యాప్ రద్దు చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పింఛనుతో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ ధర్నాకు యుటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి పివి.నరసింహారావు, ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మజీ, కోశాధికారి గంగాధర్ సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రసన్నవెంకటేష్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సోమయ్య, జి.రాజు, షేక్ సుభాషిణి, కె.వెంకట్రావు, వి.సాయిబాబా, జె.గోపి, వై.సాయికుమార్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.విజయలక్ష్మి, పి.హైమావతి, పి.సుజాత, పిఎల్‌ఎస్.కుమారి, బిజెఎన్.కుమారి, తులసి, సరోజిని, రాజకుమారి, చెల్లమ్మ, భవాని, మాణిక్యం, రామలక్ష్మి, రజిని, ఎస్.లత, పుష్ప, రాజమణి, నాగవేణి పాల్గొన్నారు.
చింతలపూడి : ఏలూరులో కలెక్టరేట్ వద్ద అంగనవాడీలు చేపట్టిన ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్.నారాయణ అన్నారు. చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ధర్నాకు వెళ్లకుండా సిఐటియు మండల అధ్యక్షులకు, నాయకులకు నోటీసులు అందజేయడాన్ని తీవ్రంగా ఖండించారు.










