May 30,2023 22:10

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సుబ్బారావు

మోడీ విధానాలతో ఉపాధి చట్టానికి తూట్లు
ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
ఉపాధి నిర్వీర్యానికి నిరసనగా వ్యవసాయ కార్మికులు కదం తొక్కారు. కాకినాడలో ధర్నా చౌక్‌ వద్ద ధర్నాకు దిగారు. ఉపాధి చట్టానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఒక్కరికీ 100 రోజులు పని కల్పించాలని, సగటు వేతనం రూ.600 చేయాలని, రెండు పూటల పనిని రద్దు చేయాలని నినదించారు. అనంతరం ఉపాధి పీడీ అడపా వెంకటలక్ష్మికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ చట్టానికి రూ.2 లక్షల కోట్లు నిధులను కేటాయించాలని కోరుతుంటే రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇది చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేన న్నారు. 100 రోజులు పని దినాలు అని చెబుతున్నా క్షేత్రస్థాయిలో 40 నుంచి 50 రోజులు కూడా పని ఇవ్వట్లేదన్నారు. సగటు కూలీ రూ.200 కూడా రావట్లేదన్నారు. పనులు లేక వలసలు పోతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే 200 రోజులు పనులు కల్పించాలని, రూ.600 కనీస కూలి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పని ప్రదేశంలో సౌకర్యాలను పూర్తిగా రద్దు చేయ డం దారుణమన్నారు. సమ్మర్‌ అలవెన్స్‌ కూడా ఆవ్వకుండా కూలీలను కేంద్రం మోసం చేస్తుందన్నారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలు చనిపోతే ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి చట్టాన్ని రక్షించుకునేందుకు పోరాటాలు ఉధతం చేయాలన్నారు. ఉపాధి చట్టంపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 రోజులు పాటు అన్ని గ్రామాల్లో పర్యటించగా అనేక సమస్యలను కూలీలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమ లశెట్టి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.సింహాచలం, కె.వెంకటలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు కె.రాఘవ, అదృష్టదీపుడు, జిల్లా కమిటీ సభ్యులు పి.కృష్ణ, తణుకు రాజు, తణుకు రాంబాబు, హేమలత, సుశీల తదితరులు పాల్గొన్నారు.