Jun 23,2023 02:01
ర్యాలీలో ఏలూరి అభివాదం

ప్రజాశక్తి-పర్చూరు: తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర సందర్భంగా పర్చూరులో పసుపు సైనికులు కదం తొక్కారు. గురువారం పర్చూరు నియోజకవర్గంలో సాగిన యాత్రకు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగునడునా బ్రహ్మరథం పట్టారు. కారంచేడు వద్ద మహిళలు హారతులతో చైతన్య యాత్ర బస్సుకు దిష్టి తీసి హారతులు ఇచ్చారు. పర్చూరు చైతన్య రథయాత్రకు 300 ట్రాక్టర్లతో అన్నదాతలు అగ్రభాగాన నిలిచారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఏలూరి అంటూ అంటూ యువత వెయ్యి బైకులతో ర్యాలీలో పాల్గొన్నారు. 100 కార్లతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. పర్చూరులో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోడూరి బ్రహ్మచారి కుటుంబ సభ్యులు మంగళ వాయిద్యాలతో యాత్రకు స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. పర్చూరులో రెండు కోట్ల రూపాయల నిధులతో టిడిపి హయాంలో నిర్మించిన క్రీడా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సెల్ఫీ దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు. అనంతరం బొమ్మల సెంటర్లోని ఎన్టీఆర్‌, అంబేద్కర్‌, రంగా విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం 95 అడుగుల అభయాంజనేయ స్వామి యాత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలను పూలమాల శాలువాతో సన్మానించారు. పసుపు పూలతో పర్చూరు పులకించింది. అనంతరం అసంపూర్తిగా ఉన్న పర్చూరు వాగును పరిశీలిం చారు. బొమ్మల సెంటర్లో కరపత్రాలు పంపిణీ చేశారు.
ఇది దందాల ప్రభుత్వం: ఏలూరి
రాష్ట్రంలో అక్రమ దందాలు, దౌర్జన్యాలతో వైసిపి పాలన సాగుతోందని బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. దాతల సహకారంతో స్థలాన్ని సమకూర్చి రెండు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి క్రీడా ప్రాంగణాన్ని నిర్మిస్తే తమ పేరు వేయవలసి వస్తుందని ఆ ప్రాంగణాన్ని ఇప్పటివరకు ప్రారంభోత్సవం చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రాంగణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని పర్చూరు క్రీడాకారులకు భరోసా ఇచ్చారు.. అనంతరం బొమ్మల కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌, వంగవీటి రంగా, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ర్యాలీలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎంపి శ్రీరామ్‌ మాల్యాద్రి, చీరాల ఇంచార్జ్‌ ఎంఎం కొండయ్య, బాపట్ల ఇంచార్జ్‌ నరేంద్రవర్మ, సలగల రాజశేఖర్‌బాబు, పర్చూరు మండల అధ్యక్షుడు షంషుద్దీన్‌, ఇంకొల్లు అధ్యక్షుడు హనుమంతరావు, కారంచేడు అధ్యక్షుడు శ్రీహరి, యద్దనపూడి మండల అధ్యక్షుడు రంగయ్య, చినగంజాం మండల అధ్యక్షుడు పొద వీరయ్య, మార్టూరు మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.