Aug 14,2023 18:32

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
            సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొబ్బరి రైతులు కదం తొక్కారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఎపి రైతు సంఘం, కొబ్బరి రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. కొబ్బరికాయల కొనుగోళ్లు లేకపోవడంతో మొలకలు వచ్చిన, ఎండిన కొబ్బరికాయలను కలెక్టరేట్‌ ముందు వేసి ధర్నా నిర్వహించారు. కొబ్బరిరైతులను ఆదుకోవాలంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉన్న కొబ్బరి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహా, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు బొల్లి రామకృష్ణ మాట్లాడారు. కొబ్బరి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల 50 వేలు, ఏలూరు జిల్లాలో 35 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. కొబ్బరికి కనీస ధర కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి చెట్ల నుండి రాలిన కాయలు గుట్టగా పోయడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో తోటల్లోనే ఉంచివేయడంతో మొలకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులకు కొబ్బరికాయకు రూ.ఐదు నుండి రూ.ఆరు మాత్రమే ధర వస్తోందన్నారు. వినియోగదారులకు మాత్రం నాణ్యమైన కొబ్బరికాయను రూ.30పైగా అమ్ముతున్నారన్నారు. ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గిపోయాయని చెప్పారు. కొబ్బరికాయలు చెట్టు నుండి కోసుకునేందుకు వ్యాపారులు గతేడాది వరకూ రూ.వెయ్యి నుండి రూ.1200 వరకూ ధర ఇచ్చేవారని, ప్రస్తుతం రూ.600 నుండి రూ.700 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొబ్బరి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అనుమతులు ఇవ్వడం వల్ల దేశీయ మార్కెట్‌లో కొబ్బరికి ధర పడిపోయిందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధర రాని సమయంలో ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆచరణలో అమలు లేదని విమర్శించారు. ఎకరా కొబ్బరి సాగుకు ఏడాదికి రూ.40 వేలకు పైగా ఖర్చవుతుందని కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్టాల్లో కూరుకుపోతున్న కొబ్బరి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నాఫెడ్‌, ఆయిల్‌ ఫెడ్‌లను వెంటనే రంగంలోకి దింపి కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరారు. కొబ్బరి రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలన్నారు. విదేశీ కొబ్బరి దిగుమతులను నిషేధించాలని కోరారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను సహకార రంగంలో ఏర్పాటు చేయాలన్నారు. ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందించాలని, ఉద్యాన వన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలు అమలు చేయాలని కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించొద్దని, ఉచిత విద్యుత్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంతమంది రైతుల వద్ద ఎన్ని క్వింటాళ్లు దిగుబడి ఉందో తెలియజేస్తే దాని ఆధారంగా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పానుగంటి అచ్యుతరామయ్య, గంటా పాపారావు, గుదిబండి రమేష్‌రెడ్డి, వేగుంట సురేష్‌ బాబు, తాతిన రమేష్‌, బొప్పన మార్కండేయులు, పెదర్ల రాంబాబు, వైవికె.కృష్ణారావు, పి.బలరామరాజు, కెఆర్‌.రారు, బూరుగుపల్లి రామకృష్ణ, పి.రామభద్రరాజు, బి.గోవర్థనరావు, పి.కృష్ణ ప్రసాదరెడ్డి, పి.నరసింహారావు, బొప్పూడి రాంబాబు పాల్గొన్నారు.