Jul 10,2023 23:56

రంప చోడవరంలో ర్యాలీ చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-పాడేరు:తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ కేంద్రం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సోమవారం 36 గంటల మహాధర్నా చేపట్టారు. అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో అంగన్వాడీ వర్కర్లు ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నారు. పాడేరు ఐటిడిఏకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలపై నినదిస్తూ ధర్నా చేపట్టారు. గ్రామ గ్రామాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వందలాదిగా తరలివచ్చారు. ఐసిడిఎస్‌ కు బడ్జెట్‌ పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు జగన్‌ పాదయాత్రలో అంగన్వాడీల ఓట్లు రాబట్టుకోవడం కోసం అనేక రకమైన హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటి నెర వేర్చలేదని విమర్శించారు. మాట తప్పను మడమ తిప్పను అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనాలు, గ్రాట్యూటీ, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. ఐసిడిఎస్‌కు బడ్జెటును పెంచాలని డిమాండ్‌ చేశారు. ధరలు పెరిగి పోతున్నా వేతనాలు పెరగక పోవడంతో అంగన్వాడీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.తక్షణం సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పోతురాజు, భగత్‌ రామ్‌, సహాయ కార్యదర్శి కిలో మొస్సాయ, సన్నిబాబు, శంకరరావు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు మంగమ్మ, గిరిజన సంఘం నాయకులు, అంగన్వాడి జిల్లా నాయకులు కళావతి, కొండమ్మ, వెంకటలక్ష్మి, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం :రంపచోడవరం ఏజెన్సీలో అంగన్వాడీలు మండుటెండను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జాతీయ కమిటీ పిలుపు మేరకు 36 గంటల ధర్నాలో భాగంగా సోమవారం యూనియన్‌ రంపచోడవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు నల్ల చీరలు ధరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మొదట సీఐటీయూ కార్యాలయం నుండి రంపచోడవరం పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం ర్యాలీగా ఐటిడిఎ వద్దకు చేరుకొని అక్కడ 36 గంటల ధర్నాను ప్రారంభించారు. అంగన్వాడీల నినాదాలతో రంపచోడవరం దద్దరిల్లింది. ఈ సందర్భంగా సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పి జగన్‌ మాట తప్పారన్నారు. అంగన్వాడీలకు గ్రాడ్యూటీ ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా అమలు చేయలేదన్నారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నిర్మల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన 36 గంటల ధర్నాను చూసైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.రామరాజు, యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.రామలక్ష్మి, కె.రాణి, కె వెంకటలక్మి, నాయకులు రత్నకుమారి, బేబీ రాణి, ప్రసున్న, సింగారమ్మ, నాగదేవి, సిహెచ్‌.కుమారి, ఏడు మండలాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు.
చింతూరు : చింతూరు డివిజన్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు స్థానిక ఐటీడీఏ ముందు 36 గంటల ధర్నా చేపట్టారు. దీనిని విఆర్‌.పురం ఎంపీపీ కారం లక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య, సున్నం రంగమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌కి నిధులు పెంచకుండా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ఉద్యోగ భద్రత, కనీసం వేతనం అమలు చేయాలన్నారు. టిఎ బిల్లు 2017 నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ధర్నాకు గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్‌, నగేష్‌, వ్యకాస ఎర్రంశెట్టి శ్రీనివాస్‌రావు, ఐద్వా నేత ముర్రం రంగమ్మ, యుటిఎఫ్‌ నాయకులు పండా కృష్ణయ్య, కురుసం బ్రహ్మయ్య మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌, నాయకులు బీరబోయిన దిలీప్‌, ప్రాజెక్టు నాయకులు వెంకటరమణ, కనకదుర్గ, రాజేశ్వరి, సూర్య కుమారి, ముత్తమ్మ, అన్నపూర్ణ, వీరమ్మ, అర్జమ్మద, పార్వతి, జయ, నాలుగు మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు