Jul 10,2023 22:30

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
          సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీలక్ష్మిబారులా పోరాడాలని పలువురు వక్తలు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు స్థానిక జ్యూట్‌మిల్లు సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాకు ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించగా పలువురు వక్తలు మద్దతు తెలిపి మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్‌, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐక్యంగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ తన పాదయాత్రలో కనిపించిన ప్రతిఒక్కరికీ ముద్దులు పెట్టారని, నాడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేడు అడుగుతుంటే బెదిరించడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకానికి కేటాయించే మెనూఛార్జీ గిట్టుబాటు కాదన్నారు. పిఆర్‌సి అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులను, పర్మినెంట్‌ చేస్తామని కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసగించిందన్నారు. మాట తప్పి, మడమ తిప్పిన నేతగా జగన్మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాదారులను నియమించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీల ఐక్యతను చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక అంగన్వాడీలను వివిధ తనిఖీల పేర్లతో వేధించడం సిగ్గు చేటన్నారు. అంగన్వాడీలను అవమానించడానికే ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. పైగా రాజకీయ వేధింపులు తీవ్రంగా పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే రూ.వెయ్యి అదనంగా జీతం ఇస్తానని నమ్మబలికి అంగన్వాడీలను నిలువునా మోసగించారన్నారు. కేవలం రూ.వెయ్యి జీతం పెంచి అంగన్వాడీల సంక్షేమానికి ఎసరు పెట్టారన్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టడానికి రైతాంగం చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎపి ఎన్‌జిఒల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పింఛన్‌తో కూడిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.పోశమ్మ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ ఈ ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకులు టి.మాణిక్యం, పి.హైమావతి, పిఎల్‌ఎస్‌.కుమారి, బిజెఎన్‌.కుమారి, తులసి, సరోజిని, రాజకుమారి, ఆదిలక్ష్మి, రజిని, జయసుధ, రామలక్ష్మి ఎస్‌.లత, పుష్ప, నాగవేణి, సిఐటియు జిల్లా నాయకులు బి.సోమయ్య, ఎస్‌కె.సుభాషిణి, ఆర్‌విఎస్‌.నారాయణ, వి.సాయిబాబు, జె.గోపి, బి.జగన్నాధం పాల్గొన్నారు.