Oct 21,2023 20:20

దశమంతపురంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రైతు భరోసా కేంద్రం

ప్రజాశక్తి - వీరఘట్టం : ప్రజలకు మరింత చేరువలో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భవన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారినట్లైందని పలువురు చర్చించుకుంటున్నారు.
మండలంలో సచివాలయ, ఆర్‌బికె, హెల్త్‌క్లినిక్‌ భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. దశమంతపురం, చిన్న గోరకాలని, నర్సిపురం, వీరఘట్టం, బిటివాడ, రేగులపాడు, నడిమికెళ్ల, నడుకూరు, చలివేంద్రి తదితర గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు వీరఘట్టం మినహా అన్ని గ్రామ సచివాలయాల్లో బోర్డులకే పరిమితమయ్యాయి.
ఇరుకైన గదుల్లో నిర్వహణ
మండలంలోని కిమ్మీ, నడిమికెళ్ల, చిటిపూడి వలస, తూడి, వండువ, కత్తుల కవిటి, తలవరం, చిదిమి, హుస్సేనపురం తదితర గ్రామాల్లో సచివాలయ నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ వాటిని ప్రారంభించకపోవడంతో ఉన్న ఇరుకైన భవనాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంతో పాటు రేగులపాడు, చిన్న గోరకాలని, తూడి తదితర గ్రామాల్లో భవన సదుపాయాలు లేకపోవడంతో సచివాలయాలు అద్దె కొంపలో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలకు అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఇటువలె మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాలకులు ధ్వజమెత్తారు. వైయస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌లకు భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలతో పాటు చెట్ల నీడలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ గుత్తేదారులు నిర్మాణ పనులు చేపట్టేందుకు విముక్త చూపటం లేదు. చేసిన పనులకు బిల్లులు వస్తాయా రావా అన్ని సంసిద్ధతలో గుత్తేదారులు ఉన్నారు. ప్రస్తుతం మండలంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులు ఏ స్థితికి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.