Sep 10,2023 21:20

కడా వైస్‌ ఛైర్మన్‌ వై.ఓబులేసునందన్‌

కడప అర్బన్‌ అథారిటీ (కడా) ఉన్నతీకరణే లక్ష్యం. ఇందులో భాగంగా మొదటిసారిగా ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడమైంది. ఇక్కడి నుంచి కడా అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఆర్నెళ్లుగా అక్రమ లేఅవుట్లపై చర్యలకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొంతమేర పురోగతి సాధించడంతో రూ.ఐదు కోట్ల జరిమానా వసూలు చేశాం. ఉమ్మడి కడప జిల్లాలోని నాలుగు వేల పైచిలుకు పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రణాళికా సంబంధిత అంశాలు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లకు అనుమతులు, మాస్టర్‌ప్లాన్స్‌, భూవినియోగ మార్పు, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ పరిధిలోని నిర్మాణ పనులను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని పేర్కొంటున్న కడప పట్టణ అథారిటీ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ కె.ఓబులేసునందన్‌తో ప్రజాశక్తి ముఖాముఖి...
- ప్రజాశక్తి - కడపప్రతినిధికడా పురోగతికి తీసుకున్న చర్యలేమిటి?
కడప పట్టణాభివృద్థి (కడా) సంస్థ ఆధ్వర్యంలోని 400 అక్రమ లేఅవుట్లను గుర్తించాం. ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, బద్వేల్‌, రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో అత్యధిక అక్రమ లే అవుట్లను గుర్తించాం. ఈమేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవడమైంది. ఇందులోభాగంగా సుమారు రూ.ఐదు కోట్ల మేర ఆదాయం సమకూరింది.
కడా' అభివృద్ధి మార్క్‌ మాటేమిటి?
కడప పట్టణాభివృద్ధి (కడా) సంస్థ పరిధిలో మొదటిసారిగా ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈనే పథ్యంలో కడాలో అక్రమ లేవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో జరిమానా రూపంలో వచ్చిన రూ.ఐదు కోట్ల ఆదాయాన్ని రూ.1.40 కోట్లతో కోటిరెడ్డి సర్కిల్‌, ఏడురోడ్డ కూడలి అభివృద్ధి, వీరపునాయునిపల్లి మండల పరిధిలోని అనిమెల- పాయ సంపల్లి మధ్య రూ.50 లక్షలతో రహదారి పనులు, రూ.20 లక్షలతో దువ్వూరు మండల పరిధిలోని తెలుగుగంగప్రాజెక్టు పార్క్‌, రూ.2 కోట్లతో ప్రొద్దుటూ రులో క్లాక్‌టవర్‌, రూ.2 కోట్లతో బద్వేల్‌లో స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడమైంది.
'కడా' పరిధిని వివరించండి?
ఉమ్మడి కడప జిల్లాలోని 5392.26 స్వేర్‌ కిలోమీటర్ల మేర విస్తరించింది. కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీల పరిధిలోని కడప మినహా మిగిలిన తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని నాలుగు వేలకుపైగా పంచాయతీలు, తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలోని భవన నిర్మాణాల లేఅవుట్లు, ఇతర అభి వృద్ధి పనులను కడా పరిధిలోకి తేవడం తెలిసిందే.
కడప మాస్టర్‌ప్లాన్‌ సందేహాల మాటేమిటి?
కడప, ప్రొద్దుటూరు, పులివెందుల మాస్టర్‌ప్లాన్స్‌ పబ్లిష్‌ చేయడమైంది. ఇందులో కడప కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌పై తలెత్తిన సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తాం. ఆర్‌వి అసోసియేట్స్‌ ఏజెన్సీ రూపొందించింది. ఆర్‌వి అసోసియేట్స్‌ ఏజెన్సీ, కార్పొరేషన్‌, కడా లతో సంయుక్త సమావేశాల ద్వారా అవగాహన కల్పించడం జరుగు తుంది. ఈమేరకు కడప మాస్టర్‌ప్లాన్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమైంది.
కడా ప్రాధాన్యతను గురించి తెలపండి?
రాష్ట్రంలోని మూడు అథారిటీల్లో కడప అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఒకటి. ఇందులో ప్రధానంగా గుంటూరులోని ఎపి సిఆర్‌డిఎ, వైజాగ్‌లోని విఎంఆర్‌డి తర్వాత కడా మూడో స్థానంలో నిలిచింది. కడా జిల్లా భవిష్యత్‌ ప్రణాళికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు.
అక్రమ లేఅవుట్లపై చర్యల గురించి తెలపండి?
ఉమ్మడి జిల్లాలో సుమారు 400 భవన నిర్మాణ లేఅవుట్లు ఉన్నాయి. ఇందులో 100 అక్రమ లేఅవుట్లను గుర్తించడమైంది. ఈమే రకు అక్రమ లేఅవుట్ల నిర్వాహకుల నుంచి స్వల వ్యవధిలో రూ.5 కోట్ల జరిమానా విధించడమైంది. అక్రమ లేఅవుట్ల నివారణలో భాగంగా జరిమానాలను విధించడంతోపాటు పరిస్థితిని బట్టి కోర్టుల్లో పిల్‌ వేసే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని అక్రమార్కు లు గుర్తుంచుకోవాలి.
ఎంఐజి అవుట్ల పురోగతిపై మీకామెంట్‌?
రాష్ట్రంలోనే అత్యధిక లేఅవుట్లను ఏర్పాటు చేసిన గుర్తింపు లభించింది. అత్యాధునిక వసతులతో అతి తక్కువ, న్యాయమైన ధరలతో అందుబాటులో ఉంచుతున్నాం. ఇందులోభాగంగా రాయచోటి ఫేజ్‌-1లో 297, ఫేజ్‌-2లో 230, రైల్వేకోడూరులో 200, రాజం పేటలో 105, బద్వేల్‌లో 284, ప్రొద్దుటూరులో 484 ప్లాట్లు వెరసి 1600 ప్లాట్లను అందుబాటులో ఉంచుతాం. త్వరలో రాజంపేట ఫేజ్‌-2, కడపలోనూ ఎంఐజి లేఅవుట్లు అందుబాటులోకి రానున్నాయి.
జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ గురించి వివరించండి?
ఉమ్మడి జిల్లాలోని మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధరల్లో జగనన్న టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయడమైంది. ఈమేరకు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులోభాగంగా జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేల్‌ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జగనన్నటౌన్‌షిప్‌ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. రాబోయే రోజుల్లో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గ కేంద్రాల్లో జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం.