- కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : కచ్చితమైన వివరాలతో ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 21 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి, ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, లేని ఓటర్ల పేర్లు తొలగించడంతో పాటు అడ్రస్, డోర్ నంబరు తదితర వివరాలనూ ఓటర్ల జాబితాల్లో సరిచేస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు తమ బూత్ ఏజెంట్ల జాబితాలను ముందే అందజేయాలని కోరారు. బిఎల్‌ఒతో పాటు పార్టీల ఏజెంట్లూ ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించడం ద్వారా సమగ్ర జాబితాలు తయారవుతాయని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా కళాశాలల్లో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వలస కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, ఇళ్లు, స్థిర నివాసం లేని వారి వివరాలను సేకరించి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటుహక్కు కల్పించి, రెండో దాన్ని తొలగిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో వైసిపి ప్రతినిధి ఆర్.శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్, బిఎస్‌పి నాయకులు మల్లిబాబు, బి.నారాయణరావు, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ మురళీకృష్ణ, ఇఆర్‌ఒలు, ఎలక్షన్ సెల్ అధికారులు, ఎన్నికల డిటిలు పాల్గొన్నారు.










