వేసవి వచ్చిందంటే చాలు మామిడి సీజన్ వచ్చినట్లే.. ఇక ఆహార ప్రియులు పచ్చి మామిడి (కచ్చా ఆమ్) కాయలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. మామిడికాయ పులిహోర, పప్పు, పచ్చడి, ఇలా.. ఒక్కటేంటి ఎన్నో వెరైటీలను ఆస్వాదిస్తుంటారు. అయితే ఎప్పుడూ తినే వెరైటీలకు కాస్త భిన్నంగా మరికొన్ని రుచికరమైన వంటలు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..!
మురబ్బా
కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడి - 5 కాయలు, దాల్చిన చెక్క - మూడు ముక్కలు, యాలుకలు - ఆరు, పటిక బెల్లం / పంచదార- 1/2 కేజీ, నిమ్మరసం - 2 స్పూన్లు, కుంకుమపువ్వు - చిటికెడు, బాదం పప్పు - ఆరు, నీళ్లు - తగినన్ని.
తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమామిడిని శుభ్రంగా కడగాలి.
చెక్కు తీసి నిలువుగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పటిక బెల్లాన్ని చితగ్గొట్టి పక్కన పెట్టుకోవాలి.
ఓ గిన్నెలో మూడు కప్పులు నీళ్లు తీసుకుని, ఇందులో కోసిపెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేయాలి.
దీన్ని పొయ్యిమీద పెట్టి 10 నుంచి 12 నిమిషాలు ఉడకనివ్వాలి.
ఉడికిన ముక్కలను వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి.
ఇందులో పటికబెల్లం పొడి/ పంచదార వేసి 30-40 నిమిషాలు పక్కన పెట్టాలి.
పటిక/ పంచదార పూర్తిగా కరిగాక పొయ్యిమీద పెట్టి, చిటికెడు కుంకుమపువ్వు, నిమ్మరసం వేసి సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి.
ఇందులో దాల్చినచెక్క, యాలకులు, కట్ చేసి పెట్టుకున్న బాదంపప్పు వేసి కలుపుకోవాలి.
పాకం చిక్కబడ్డాక దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన పచ్చిమామిడి మురబ్బా రెడీ.
దీన్ని గాజు డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు.
షర్బత్
కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడి - 3 కాయలు, పంచదార/ పటిక బెల్లం - 1/4 కేజీ, పుదీనా - కొద్దిగా, ఐస్‌క్యూబ్స్ - ఆరు, సోడావాటర్ - 200 మి.లీ.
తయారుచేసే విధానం : పచ్చిమామిడిని చెక్కుతీసి, ముక్కలుగా కోసి ఓ గిన్నెలో వేసుకోవాలి.
అ ఇందులో నీళ్లుపోసి 10 నిమిషాలు మరగనివ్వాలి.
అ వేరే పాత్రలోకి నీటిని వడకట్టుకోవాలి.
గమనిక : మురబ్బా తయారు చేసుకున్నప్పుడు వడకట్టిన నీటిని వాడుకోవచ్చు.
ఈ నీటిలో పటిక బెల్లం పొడి మూడుస్పూన్లు వేసి కలుపుకోవాలి.
సర్వింగ్ గ్లాసెస్‌లో ఐస్‌క్యూబ్స్ వేసి, ఇందులో పుదీనా ఆకులు వేయాలి.
ఆ గ్లాసుల్లో ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న నీటిని, కొద్దిగా సోడా వాటర్‌ని పోయాలి. అ కూలింగ్ ఎక్కువగా కావాల్సిన వాళ్లు ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు.
తాజా తాజా ఆమ్ కా షర్బత్ సిద్ధం.
కడీ
కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడి కాయలు - 2, నూనె - టీస్పూను, మెంతులు - 1/2 టీస్పూను, ఆవాలు - 1/2 టీస్పూను, స్ప్రింగ్ ఆనియన్స్ - 3, ఎండుమిర్చి - 3, శనగపిండి - 1/2 కప్పు, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - 1/2 స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కారం - స్పూను, బెల్లం తురుము - 2 స్పూన్లు.
తయారుచేసే విధానం: పచ్చిమామిడిని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెవేసి వేడెక్కాక మెంతులు, ఆవాలు, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు వేసి కలుపుకోవాలి.
ఇందులో ఎండుమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ ఆకులు, కరివేపాకు వేసి కలుపుకోవాలి.
మిక్సీజార్‌లో కొన్ని మామిడిముక్కలు వేసి, గ్రైండ్ చేసుకోవాలి.
ఒక బౌల్‌లో పేస్టువేసి, ఇందులో శనగపిండి వేసి కలుపుకోవాలి.
ఇందులో పసుపు, ఉప్పువేసి నీళ్లు పోస్తూ బాగా మిక్స్ చేయాలి.
దీన్ని పొయ్యి మీదున్న పోపులో పోయాలి.
ఇందులో మిగిలిన మామిడిముక్కలు వేసి కలపాలి.
ఇప్పుడు కారం వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
రెండు నిమిషాల తర్వాత బెల్లం తురుము వేసి , పదినిమిషాలు ఉంచి దించేయాలి.
తురుము కొబ్బరి చెట్నీ
కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడి - 3 కాయలు, కొబ్బరికాయ - ఒకటి, పచ్చిమిర్చి - 100 గ్రా, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - రెండు, తాలింపు గింజలు - స్పూన్, వెల్లుల్లి - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, నూనె - స్పూన్.
తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమామిడి కాయలను కడిగి, తురుముకోవాలి.
ఇందులో కొబ్బరి ముక్కలుగా కోసి, మిక్సీలో పట్టుకోవాలి.
పాన్‌లో పచ్చిమిర్చి వేసి, దోరగా వేగించుకోవాలి.
దీన్ని కూడా కొబ్బరితోపాటు మిక్సీ పట్టుకోవాలి.
ఈ పేస్టును మామిడితురుములో వేసి కలుపుకోవాలి.
మరో పాన్‌లో కొద్దిగా నూనెవేసి వేడెక్కనివ్వాలి.
ఇందులో ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేగాక, తాలింపు గింజలు వేసి చిటపటలాడాక పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపుపెట్టుకోవాలి.
ఘుమఘుమలాడే తురుము కొబ్బరి చట్నీ రెడీ.
దీన్ని వేడివేడి అన్నంలోగానీ, దోశల్లోగానీ కలిపి తింటే బాగుంటుంది.