Sep 23,2023 23:58

ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్‌ రెక్కాడితేనే కానీ డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. రోజూ వచ్చిన కూలి డబ్బులతోనే పూట గడిచేది. తమ దినచర్యలో భాగంగా శనివారం ఉదయం బోరు వేయడానికి జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి వెళ్లిన ముగ్గురినీ మత్యువు కరెంటు రూపంలో కబళించింది.
జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గళ్ల నాగరాజుకు గండేపల్లి మండలం ఉప్పలపాడులో పామాయిల్‌ తోట ఉంది. ఆ తోటలో బోరు మరమ్మతు చేసేందుకు కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బొదిరెడ్డి సూరిబాబు (45), జగ్గంపేటకు చెందిన కిల్లి నాగేశ్వరరావు (45) వెళ్లారు. నాగరాజు మనవడు గళ్ల బాబీలు (25)తో కలిసి ఐరన్‌ గొట్టాలు పైకి లేపే క్రమంలో పైన ఉన్న 11 కెవి విద్యుత్‌ వైర్లకు తగలడంతో ముగ్గురూ విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. విషయం తెలిసిన ముగ్గురు కుటుంబాల సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి రోదించిన తీరు పలువురి కంట తడి పట్టించింది. ఒక్కసారిగా ఈ ముగ్గురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
జగ్గంపేటకు చెందిన కిల్లి నాగేశ్వరరావు బోరు మోటారు పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆయనకు భార్య లక్ష్మి, అమ్మాయి రమాదేవి, అబ్బాయి గణేష్‌ ఉన్నారు. వారిద్దరూ అవివాహితులు. కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బొదిరెడ్డి సూరిబాబు రోజూ వారి కూలి పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. సూరిబాబుకు భార్య, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం కాగా, మరో ఇద్దరికి వివాహం కావాల్సి ఉంది. సూరిబాబు మరణంతో ఆ కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉంది. జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గళ్ల బాబీలుపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బాబీలు తండ్రి మరణించగా తల్లి సోదరి, సోదరునితో కలిసి ఉంటున్నాడు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా
పెద్దాపురం మృతుల కుటుంబాలను ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అన్ని విదాలా ఆదుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. మృతుల కుటుంబాల వారు స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రి వద్ద చేపట్టిన ఆందోళనకు సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, నాయకులు కూనిరెడ్డి అప్పన్న, కె.సింహాచలం మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ మతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, విద్యుత్‌ శాఖ తరపున రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు.కొంతసేపు రాస్తారోకో చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులతో చర్చించి తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించారు. కర్నాకుల వీరాంజనేయులు, జనసేన నాయకుడు పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొన్నారు.