Nov 01,2022 21:03

పడవ మునిగి ఇద్దరు మహిళా కూలీలు మృతి
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌

వారంతా నిరుపేదలు.. కూలిపనులకు వెళితేగానీ పూటగడవని కుటుంబాలు.. పొట్టకూటి కోసం ప్రమాకర పనులకు సైతం వెళ్తుంటారు.. ఈ క్రమంలో ఓ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కొల్లేరులో పడవ బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలం శ్రీపర్రు గ్రామానికి చెందిన గౌరమ్మ(55), పైడమ్మ(45), మరికొంతమంది కూలి పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగానే మంగళవారం కూడా గౌరమ్మ, పైడమ్మ, మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి కూలి పనులు నిమిత్తం ఇనుప పడవలో కొల్లేరులో తూడు తొలగింపు పనులకు వెళ్లారు. తిరిగి వస్తుండగా గట్టు ఎక్కే క్రమంలో పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో పైడమ, గౌరమ్మలు నీట మునిగి మృతి చెందారు. మరో నలుగురిని స్థానికులు రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాలతో బయటపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీపర్రులో విషాదం
ఇద్దరు మహిళా కూలీల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలు గౌరమ్మకు ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. అయితే భర్త అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. గౌరమ్మే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. ఆమె మృతిచెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పైడమ్మకు ముగ్గురు కుమారులున్నారు. ఇద్దరికి వివాహమై హైదరాబాదులో ఉంటున్నారు.
కొల్లేరులో పని.. కత్తిమీద సామే..!
చాలా కాలంగా కొల్లేరు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే వారి పరిస్థితి కత్తి మీదసాములా మారింది. కాంటూరు సరిహద్దు ప్రాంతాల్లో ప్రభుత్వ కొల్లేరు అభయారణ్యాన్ని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకుని వాటిలో చెరువులు తవ్వి స్థానికంగా ఉండే లంక ప్రాంతాల్లో ఉండే కూలీలతో కూలి పనులు చేయించుకుని డబ్బు సంపాదిస్తున్నారు. కానీ కూలీలు మాత్రం ప్రమాదపుటంచున పనులు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వీటిపై దృష్టి పెడితే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమిత కొల్లేరును తిరిగి కొల్లేరు ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.