ప్రజాశక్తి-వినుకొండ : వినుకొండ ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్లా.. కానీ చెప్పే మాటలు అన్ని డొల్ల అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా రెండ్రోజులుగా నూజెండ్ల, వినుకొండ మండలాల్లో ఆయన పాదయాత్ర చేశారు. వినుకొండ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జా రాయుడు బొల్లా బ్రహ్మనాయుడన్నారు. బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో 170 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి కాజేశాడని, పసుపులేరు బ్రిడ్జి వద్ద 62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తెలిపారు. పట్టణంలోని ముస్లిం సోదరుడు ఫరీద్ కుటుంబానికి సర్వే నెంబర్ 214లో మూడు ఎకరాల భూమి ఉంటే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కబ్జా చేశాడని ప్రశ్నించిన ఫరీద్‌పై పోలీస్ స్టేషన్లో పెట్టి చితకబాదించాడని అన్నారు. తెల్లపాడులో శ్రీనుకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశాడని ఆరోపించారు. వెంకుపాలెం వద్ద డెయిరీకి రోడ్డు వేసుకునేందుకు దళితులకు చెందిన ఎకరంన్నర భూమిని ఆక్రమించారని, ప్రభుత్వ భూములను ఆక్రమించి సెంటు స్థలాల పేరుతో మళ్లీ ప్రభుత్వానికి విక్రయించి రూ.20 కోట్లు అప్పనంగా కాజేశారని విమర్శలు గుప్పించారు. గుండ్లకమ్మ నది, వాగుల నుండి ఇసుక దోపిడీ, చెరువుల్లో భూముల్లో మట్టి దోపిడీ, బియ్యం, గుట్కా మాఫియా అన్ని ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అన్నారు. వినుకొండలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకి 'బి' టాక్స్ చెల్లించాల్సిందేనని ఆరోపించారు. అభివృద్ధిలో వినుకొండ నాలుగేళ్ల క్రితం ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉందన్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్లతో కొట్టేసి వాటిపై రూ.వందల కోట్లు బ్యాంకు రుణాలు తెచ్చుకున్న వ్యక్తి బ్రహ్మనాయుడు అని విమర్శించారు. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీకి వినకొండ మున్సిపాలిటీ కేరాఫ్‌గా మార్చేశారని, బొల్లాపల్లి మండలంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 13 వేల ఎకరాలకు 8 వేల పాస్ పుస్తకాలు ఇప్పించి రూ.100 కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. కబ్జారాయుడును ఓడించకపోతే వినుకొండలో ఎవరి భూమీ మిగలదని, కొండలు కూడా మింగేస్తారని అన్నారు. 9 నెలలు ఓపిక పడితే కబ్జాల రాయుడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తనదన్నారు. టిడిపి కార్యకర్తల జోలికి రావాలంటే భయపడే విధంగా చేస్తానని, చట్టాన్ని అతిక్రమించి అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోరాడిన ప్రతి కార్యకర్తని ఆదుకుంటామని, ఎక్కువ కేసులు ఉన్నవారికి పెద్ద నామినేటేడ్ పదవి ఇస్తానని ప్రకటించారు. కేసులకు భయపడేదే లేదని, టిడిపి నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వినుకొండలో ఉన్నా, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపల వేయిస్తానని హెచ్చరించారు. టిడిపి హయాంలో రూ.2400 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయిన జీవీ ఆంజనేయులు నిధుల కోసం తనతో పోట్లాడే వారిని చెప్పారు. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నను తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. వినకొండకు సిఎం జగన్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారని, వరికపూడిశెల, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, వినుకొండలో మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వాస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. ఈ హామీల గురించి సిఎంను అడిగే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా? అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి, ఫిట్‌మెంట్ ఇస్తామన్నారు. బిసి ఉప కులాల వారీగా నిధులు, బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్లు తెలుసుకున్నారని, వాటర్ గ్రేడ్ ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్లలో వరికేపూడిశెల పూర్తి చేస్తామని ప్రకటించారు. వినుకొండ ప్రాంతానికి పరిశ్రమలను తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, దెబ్బతిన్న రహదారులను నిర్మిస్తామని, గుండ్లకమ్మ నదిపై చెక్ డాం నిర్మించి సాగునీటి వసతి అందిస్తామని, ముస్లిం మైనార్టీలకు షాదీ ఖాన నిర్మిస్తామని, 90 శాతం పూర్తి అయిన టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు.
నేటి పాదయాత్ర వివరాలు
ఉదయం 8 గంటలకు నగరాయపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9 గంటలకు కొండ్రముట్లలో పాదయాత్ర 2300 కిలో మీటర్లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
10 గంటలకు సత్యనారాయణపురంలో స్థానికులతో సమావేశం.
11 గంటలకు కొచ్చెర్లలో స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం ఒంటిగంటకు అంగలూరులో స్థానికులతో సమావేశం.
2 గంటలకు వనికుంటలో స్థానికులతో సమావేశం.
2.15 గంటలకు వనికుంట శివారు విడిది కేంద్రంలో బస.










