Jul 11,2023 19:07

ఐక్యతా అభివాదం చేస్తున్న వివిధ పార్టీలు, సంఘాల నాయకులు

ప్రజాశక్తి - వినుకొండ : వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతుల్లో ఉందని, భూముల ఆక్రమణలో ప్రధానంగా అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని అఖిలపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. వినుకొండ నియోజకవర్గం భూ సమస్యలు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలపై చర్చా వేదిక సమావేశం మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం గాంధీనగర్లో 450 ఎకరాల ఎస్టీల భూమి అన్యాక్రాంతమైందని, నూజెండ్ల మండలం దాట్లవారిపాలెంలో సుమారు 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆర్‌ఎంపి వైద్యులు వెంకటేశ్వర్‌రెడ్డి ఆక్రమించి చేపల చెరువు చేశారని, అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములను అధికార పార్టీ చెందిన వారు అన్యాక్రాంతం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సైతం వినకొండలో భూకబ్జాదారుడుగా మారాడని విమర్శించారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూమిలో ప్రభుత్వ భూమి ఉందని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అన్నారు. మార్కాపురం రోడ్డు పసుపులేరు బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే కొనుగోలు చేసిన 100 ఎకరాల్లో 62 ఎకరాల ప్రభుత్వ భూమెనని అన్నారు. ఇటీవల వెలసిన డాలర్‌ సిటీ అక్రమ వెంచర్లో ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమించారన్నారు. జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి గత ఏడాది డాలర్‌ సిటీ వెంచర్‌లో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిలో ఇప్పటివరకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. గతంలో అక్కడ అనధికారికంగా వేసిన వెంచర్‌లోని రాళ్లన్నీ ఎమ్మెల్యే తొలగింపజేశారని, ఏడాదిలోపు ఎమ్మెల్యే తన బినామీలతో డాలర్‌ సిటీని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. నూజెండ్ల మండలం కంభంపాడు తెల్లపాడు వద్ద రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీల ద్వారా సుమారు 30 ఎకరాలకు పైగా హస్తగతం చేసుకున్నారని, చెక్క వాగు వద్ద ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాడని, వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూములను చౌకగా కాచేశారని విమర్శించారు. వినుకొండ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ఏర్పడ్డ జగనన్న కాలనీల భూముల కొనుగోలులో ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి అమ్మి అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు కాజేసారని ఆరోపించారు. చుక్కల భూముల రెగ్యులేషన్‌ పేరుతో అధికార పార్టీ నాయకులు వందల ఎకరాల భూములకు అక్రమంగా హక్కులు సాధించుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గిరిజన రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ వి.కోటనాయక్‌, పిడిఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, షేక్‌. మస్తాన్‌వలి, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, బి.కోటయ్య, సిపిఐ నాయకులు బి.శ్రీనివాసరావు, రాము, బిఎస్‌పి నాయకులు రాజు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆర్‌.ప్రసన్నకుమార్‌, ఎంఐఎం నాయకులు షేక్‌ బాజీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు, ప్రముఖ న్యాయవాది సిహెచ్‌ఎన్‌ఎల్‌ మూర్తి, జనసేన నాయకులు వెంకటేశ్వరరావు, మాల మహానాడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏసురత్నం పాల్గొన్నారు.
భూ ఆక్రమణ వ్యతిరేక పోరాట కమిటీ
వినుకొండ నియోజకవర్గంలో భూ ఆక్రమణలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ భూములను పేదలకు పంచిపెట్టే విధంగా పోరాడేందుకు భూ ఆక్రమణ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడింది. వి.కోటనాయక్‌, షేక్‌ మస్తాన్‌వలి, ఆర్‌.ప్రసన్నకుమార్‌, రాజు, బి.శ్రీనివాసరావు, మూర్తి, షేక్‌ బాజీ, ఆర్కే. నాయుడు, వెంకటేశ్వరరావు ఉన్నారు.