ప్రజాశక్తి -గాజువాక :కబ్జా కోరల నుంచి అప్పన్న కాలనీ దోబీఘాట్‌ను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రజక వత్తిదారుల సంఘం, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయం ఎదుట శుక్రవారం రజకులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకు మద్దతు ప్రకటించిన సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, రజకులు బట్టలు ఆరబెట్టుకోవడానికి కేటాయించిన స్థలంలో, అప్పన కాలనీ దోబీఘాట్‌ను ఆనుకొని జివిఎంసి అధికారులు పైప్‌లైన్ వేసి స్థలం లేకుండా చేశారన్నారు. మరోపక్క కొంతమంది నాయకులు దోభీఘాట్ కబ్జాకు యత్నిస్తున్నారన్నారు. రజకులకు అండగా ఉండి దోభీఘాట్‌ను కబ్జా నుంచి కాపాడేందుకు సిపిఎం అండగా ఉంటుందని రాంబాబు భరోసానిచ్చారు. జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ, రెండువేల మంది రజకులు కులవృత్తినే జీవనాధారంగా బతుకుతున్నారని, వారికి శ్రీనగర్, అక్కిరెడ్డిపాలెం, అప్పనకాలనీలో ఉన్న దోబీఘాట్‌లను సిద్ధం చేయాలని కోరారు..










