కబ్జా భూముల్లో రెవెన్యూ ఉక్కుపాదం: తహశీల్దారు
ప్రజాశక్తి - ఓజిలి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూములలో తహశీల్దారు ఏ. శివరామ సుబ్బయ్య తన రెవెన్యూ సిబ్బందితో ఉక్కు పాదం మోపారు. మండలంలోని మాచవరం సచివాలయం పరిధిలో ఉన్న సర్వే 207 ,226 నెంబర్లో సుమారు మూడు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ మేతపురంబోకు భూమి ఉంది. మేత పురంబోకు భూమిలో కొంతమంది అక్రమంగా ప్రవేశించి 60 ఎకరాల వరకు ఆక్రమించుకుని నిమ్మ సాగు చేయడానికి ప్రయత్నిస్తుండగా రెవెన్యూ సిబ్బంది పలుమార్లు హెచ్చరించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు తొలగించి మళ్లీ ప్రవేశించడంతో శుక్రవారం పోలీసు బలగాలతో తహశీల్దార్ ఏ.శివరామ సుబ్బయ్య ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల వద్దకు చేరుకుని అనుమతులు లేకుండా సాగు చేస్తున్న నిమ్మ మొక్కలను తొలగించారు. సందర్భంగా తహశీల్దార్ ఏ.శివరామ సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా ఆక్రమించి సాగు చేస్తే అట్టువారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేలు గోపిరెడ్డి, ఆర్‌ఐ విజరు కుమార్, సిఐ వై.వి సోమయ్య , ఎస్‌ఐ.ఆదిలక్ష్మి ,వీఆర్వోలు, వీఏఓలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










