అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగరం పరిధిలో అన్యాక్రాంతమైన సెంట్రల్ పార్క్ స్థలం, కబ్జాకు గురైన మున్సిపల్ కార్పొరేషన్ స్థలాల స్వాధీనంపై చర్యలకు కార్పొరేటర్లు పట్టుబట్టారు. గత ఆరు నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో సైతం ఇదే అంశంపై సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు జరిగిన సమావేశంలో కూడా మళ్లీ అదే అంశం చర్చకు వచ్చింది. కార్పొరేషన్ స్థలాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా అంటూ మేయర్, కమిషనర్‌ను కార్పొరేటర్లు ప్రశ్నించారు. అనంతపురం కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మేయర్ మహ్మద్ వసీం అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. గత మార్చి నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కార్పొరేటర్ నాగమణి, సైపుల్ల బేగ్ వాసంతి లక్ష్మిరెడ్డి, అబూ సాలేహ తదితరులు అధికారులను నిలదీశారు. దీనిపై వివరణ ఇస్తూ కార్పొరేటర్లకు సర్ధిచెప్పేందుకు మేయర్ వసీం, కమిషనర్ భాగ్యలక్ష్మిలు శతవిధాలా ప్రయత్నించారు. కమలానగర్‌లోని రోటరీక్లబ్ స్థలం మున్సిపాల్టీదేనని దాన్ని సేవాభావంతో కాకుండా, విద్యా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని స్టాండింగ్ కమిటీ సభ్యలు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ భాగ్యలక్ష్మి వివరణ ఇస్తూ ఈ స్థలం మున్సిపాల్టీదే అయినా, అక్కడ పాఠశాల నిర్వహించేందుకు గతంలో కమిషనర్ అనుమతి ఇచ్చారనే లేఖను వారు చూపుతున్నారని సమాధానం ఇచ్చారు. సెంట్రల్ పార్కు ఆక్రమణలపై కూడా కమిషనర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని పలువురు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కబ్జా అయిన స్థలాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ అబుసాలేహ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, కార్పొరేషన్ ఆస్తులను కాపాడమని తాము పదేపదే అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ లక్ష్మీదేవి పలు సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కార్పొరేటర్ల మాట వినని పరిస్థితి ఉందన్నారు. తాము వార్డుల్లో సమస్యలను పరిష్కరించలేక ప్రజల చేత విమర్శలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు వేయమని అడుగుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడమే వృథా అన్నారు. డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజినీర్ నాగమోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమత స్కీం కింద వాటర్ యాక్షన్‌ప్లాన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసే అంశంలో కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జనశక్తి నగర్ మురుగు కాలువ నిర్మాణంపై కౌన్సిల్‌ను తప్పుదోవ పట్టిస్తూ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు అనుకూలంగా నివేదిక తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పనితీరు మార్చుకుని ప్రజలకు సహాయపడేలా విధులు నిర్వహించాలని సూచించారు. నగరంలోని అంకాలమ్మ పొదుపు సంఘం, సుబ్రమన్నేశ్వర పొదుపు సంఘంలో రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు కుమ్మక్కై పొదుపు సొమ్మును స్వాహా చేశారని చేశారని కార్పొరేటర్లు శ్రీనివాసులు, ధనలక్ష్మిలు తెలిపారు. దీనిపై మెప్మా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇవ్వటానికి సిద్ధమవగా మేయర్ ఆదేశాలతో ఆగిపోయారు. 44వ డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యను కార్పొరేటర్ ప్రస్తావిస్తూ జీరో ఎండ్ రోడ్డులో తాగునీరు సరఫరా కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.










