
హిందూపురం : హిందూపురం పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. గత కొన్ని రోజులుగా సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పాటు అన్ని వార్డుల్లోనూ నీటి సమస్యతో పాటు ఇతర సమస్యలున్నాయి. వీటిపై నెలకు ఒక సారి జరిగే సాధరణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు చర్చించాల్సి ఉంది. అయితే తమకు ఎందుకు అనే విధంగా కొంత మంది కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన సాధరణ సర్వసభ్వ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు 8 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సమగ్రంగా చర్చించి, పట్టణ సమస్యలపై చర్చించాల్సిన గౌరవ సభ్వులు ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా వ్యవహరించారు. టిడిపి కౌన్సిలర్లు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లి పోయారు. ప్రతి సమావేశంలోనూ అధికారులపై నోరు పారేసుకునే కొంత మంది కౌన్సిలర్లు వారు అలా వెళ్లగానే వీరు బయటకు వెళ్లి చెట్ల కింద కాలక్షేపం చేస్తూ కూర్చొన్నారు. మిగిలిన కొంత మంది కౌన్సిలర్లతో అజెండాను అమోదం చేసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు నాసీరా బాను, గిరీష్‌లు తమ వార్డుల్లో పారిశుధ్యం అస్తవ్యవస్తంగా మారిందన్నారు. కనీసం మురుగు కాలువలు సైతం శుభ్రం చేయడం లేదన్నారు. ఫాగింగ్ ఎక్కడా చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కౌన్సిలర్ రోషన్ మాట్లాడుతూ పురపాలక సంఘంలో టైటిల్ ట్రాన్స్‌ఫర్‌లు అధికారుల ప్రమేయం లేకుండానే జరిగి పోతున్నాయన్నారు. ఈ విషయంపై కమిషనర్‌ను అడిగితే ఎవరో సైట్‌ను హ్యాక్ చేశారని చెప్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల పట్టణంలో భూతగాదాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమెండ్ చేశారు. ఇక పట్టణంలో గ్యాస్ సరఫరా నిమిత్తం ఓ ప్రవేటు కంపెనీ నిర్వహకులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలు కొడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోదవాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. దీనిపై స్పందించిన ఇంజినీరింగ్ ఇప్పటికే రూ.2.45కోట్లు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి రోడ్లపై గుంతలు కొట్టడం ఆపేశారన్నారు. పట్టణ ప్రధాన సమస్యలపై చర్చించకుండా సమావేశం మమ అనిపించారు. ఈ సమావేశంలో కొంత మంది అధికార పార్టీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు.