ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు వార్డులో సమస్యలపై ఏకరువు పెట్టారు. అధికారుల సమాధా నాలతో తృప్తి చెందని ప్రతిపక్షంతో అధికార పక్ష కౌన్సిలర్లు వాదోపవా దాలకు దిగారు. ఓవైపు సంబంధిత అధికారుల గైర్హాజరుపై ఆగ్రహించిన చైర్‌పర్సన్ వార్డులో సమస్యలు పరిష్కరిస్తామని బదులివ్వటంతో సమావేశం ముగిసింది. పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఉదయం కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. చైర్‌పర్సన్ సయ్యద్ ఖలేదా నశీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి ఆరుణ తన వార్డులో సమస్యలను ప్రస్తావించారు. కాల్వలు పాడయ్యాయని, మరమ్మతులు చేయాలని 22 నెలల క్రితం కౌన్సిల్‌కు తెలియజేసినా పట్టించుకోలేదని, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం సగంలో వదిలేశారని ప్రశ్నించారు. నెలరోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ బదులిచ్చారు. చంద్రబాబు నాయుడు కాలనీ రాజీవ్ గృహకల్ప వద్ద డ్రెయినేజ్ వ్యవస్థ దెబ్బతిందని, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన 23, 24 వార్డుల కౌన్సిలర్లు తోక శిరీష, పెదలంక లక్ష్మీలావణ్య కోరారు. కౌన్సిలర్లు ఎ.కోటయ్య, జి.కోటేశ్వరరావు కూడా సమస్యలను ఏకరువు పెట్టారు.
సింగిల్ టెండర్ల ఆమోదంపై టిడిపి అభ్యంతరం
పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సింగిల్ టెండర్ ఆమోదంపై కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు పసుపులేటి త్రిమూర్తి అభ్యతరం వ్యక్తం చేశారు. దీనిపై ఎంఇ నాగమల్లేశ్వరరావు స్పందించి, ఆన్‌లౌన్‌లో టెండర్ ప్రక్రియ జరగుతుందని, ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. అయితే సింగిల్ టెండర్ వచ్చిన వాటిని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రతిపాదించామన్నారు. సింగిల్ టెండరు రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవ వచ్చుగదా? అని త్రిమూర్తి ప్రశ్నకు, ఆ అధికారం తమకు లేదంటూ ఎంఇ బదులిచ్చారు. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఎఇ రాజు గైర్హాజరుపై చైర్‌పర్సన్ ఆగ్రహం
కౌన్సిల్ సమావేశంలో వార్డుల్లో పనులు జరగటం లేదని ఓ వైపు అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఏకరువు పెడుతున్న సమయంలో ఆ వార్డుకు సంబంధించిన ఏఈ రాజు ఎక్కడని చైర్‌పర్సన్ ప్రశ్నించారు. సెలవు పెట్టారని డీఈ చెప్పటంతో ఆమె ఆగ్రహించారు. నెలలో ఒక్క రోజు సమావేశానికి కూడా హాజరు కాకపోతే ఎలా? ఆయన పరిధిలోనే ఎక్కువ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అతన్ని పురపాలక సంఘం నుంచి పంపించి వేయాలని అధికారులను ఆదేశించారు.










