Mar 26,2023 00:24

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి

ప్రజాశక్తి-యలమంచిలి
తాను సూచించిన విద్యుత్‌ మీటర్ల అంశాన్ని కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చకపోవడంపై ఆగ్రహించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి కౌన్సిల్‌ సమావేశాన్ని బహిస్కరించి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కావలసి ఉంది. అయితే తను సూచించిన అంశం చేర్చకపోవడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో అధికారులు చైర్‌పర్సన్‌ సూచించిన విద్యుత్‌ మీటర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడంతో సాయంత్రం 4.30 గంటలకు తిరిగి సమావేశం ప్రారంభమైంది.
ఎజెండాలో ముఖ్యమైన అంశంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు రూ.51.5లక్షలను రద్దు చేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. డ్రైన్లు, సిసిరోడ్లు, మొక్కలు నాటడం తదితర అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ నిధులు కేటాయించగా, సకాలంలో బిల్లులు రాక, ఎప్పుడొస్తాయోనన్న భయంతో ఆ పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆ నిధులను రద్దు చేస్తున్నట్టు కౌన్సిల్‌ తీర్మానించింది. ఆ సొమ్మును విద్యుత్‌ బకాయిలకు చెల్లిస్తూ తీర్మానించడం మరో విశేషం.
ప్లానింగ్‌ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు కనెక్షన్‌ ఇవ్వరాదని మున్సిపల్‌ అధికార్లు నోటీసుల అనంతరం కోర్టులో కేసులు వేయడంతో, అది ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించిందని, ఈ అంశాన్ని కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చాలని సభ్యులు కోరగా, టౌన్‌ప్లానింగ్‌ అధికార్లు అందుకు ససేమిరా అన్నారు. దీంతో కౌన్సిల్‌లో రభస మొదలైంది. అలా అభ్యంతరం తెలిపిన 157 గృహాలకు కోర్టు తీర్పునకు సిరసావహించే విధంగా అఫిడవుట్‌ తీసుకొని వినియోగదారులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని కౌన్సిల్‌ తీర్మానించింది. ఎదురయ్యే పరిణామాలన్నింటికీ కౌన్సిల్‌ కట్టుబడి ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. రూ.90 లక్షలతో కొమ్మాయి గుండం చెరువు పునరుజ్జీవనం పథకం పనులు ప్రభుత్వ గ్రీనింగ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌కు ఇచ్చే బదులు మనమే బాగు చేసుకోవచ్చు గదా అని కొందరు సభ్యులు అడగ్గా, ఆ పని ప్రభుత్వమే చేపట్టాలని తీర్మానించారు. సైతారుపేటరోడ్డు జంక్షన్‌ నుండి దుర్గమ్మ గుడి వరకు విద్యుత్‌ దీపాలు వేసే కార్యక్రమానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిషనర్‌ తోట కృష్ణవేణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పల్లా శ్రీనివాసరావు, ఇంజనీర్లు సునీల్‌, ఉమామహేశ్వరరావు, టిపిఓ శ్రీలక్ష్మి, మేనేజర్‌ ప్రభాకరరావు, మెస్మా పద్మావతి, వైస్‌ ఛైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, మరో 15 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.a