Oct 20,2023 00:02

కౌన్సిల్‌లో నిలదీస్తున్న గంగారావు తదితరులు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
నగరంలోని పలు వార్డుల్లోని శ్మశానాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులివ్వడం లేదని, వార్డుల్లో వీధిలైట్లు వెలగడం లేదని, జివిఎంసి కార్మికులకిచ్చే జీతాల విషయంలో అన్యాయాన్ని సరిచేయాలని, అభివృద్ధి పనులు ఒకవైపే కాకుండా అన్నిచోట్లా చేపట్టాలని కోరుతూ గురువారం జివిఎంసి కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐకి చెందిన కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కొన్ని సమస్యలపై అధికార వైసిపి సభ్యులు సైతం గొంతుకలిపారు. భీమిలి నియోజకవర్గం 4వ వార్డు పరిధిలో రూ.10కోట్ల మేర ఖర్చుచేసి రోడ్ల విస్తరణ చేపట్టడంపై 22వ వార్డు జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ అభ్యంతరం తెలపగా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివరణ ఇస్తూ.. 'ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని చేపలుప్పాడ, టి నగరపాలెం పరిధిలో రోడ్ల పనులకు జివిఎంసి నిధులు వెచ్చించిందని, విశాఖ నగరం అంతటా ఈ పనులు జరుగుతున్నాయని మీకు నగరాభివృద్ధి అక్కర్లేదా? అంటూ ప్రశ్నించారు. దీంతో టిడిపికి చెందిన పలువురు కార్పొరేటర్లు 'ఇంకెక్కడ రాజధాని' అని వారు అప్పటికే తెచ్చుకున్న పువ్వులను బయటకు తీసి చెవుల్లో పెట్టుకుని వ్యంగ్యంగా రాజధాని విశాఖకు ఇంకా రాదని, నమ్మించవద్దంటూ నినాదాలు చేశారు. కౌన్సిల్‌లో చర్చించకుండా చాలాచోట్ల రూ.కోట్లతో వైసిపి వార్డులను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారంటూ టిడిపి కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
అర్హతల పేర జీతాల్లో కోతపెట్టొదు ్ద: సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు
నీటిసరఫరా, యుజిడి, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 400 మంది కార్మికుల విషయంలో అర్హతలను పెట్టి రూ.18,500లు అందకుండా చేసే చర్యలు మానుకోవాలని మేయర్‌ పోడియం వద్దకు వెళ్లి సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు డిమాండ్‌ చేశారు. గతంలో జిఒ 5, 7 కింద జీతాలిచ్చారని, మధ్యలో పొరపాటేదో జరిగిందని కలెక్టర్‌ వద్దకు ఈ వ్యవహారం వెళ్లిందని తెలిపారు. జిఒ పేరుతో ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్స్‌ అనేవి అర్హతలుగా చూపించి 600 మందిలో కేవలం 150 మందికే రూ.18,500 జీతం ఇచ్చేలాగ కాకుండా అందరికీ వర్తించేలా విధానాన్ని సవరించి మిగతా 400 పైచిలుకు కార్మికులకు అన్యాయం జరగకుండా అజెండాను ఆమోదించాలని, మిగతా రాజకీయ పార్టీల కార్పొరేటర్లు మద్దతుగా నిలవాలని కోరారు. జివిఎంసి వాటర్‌ సప్లరు ఇంజినీర్‌ రవి మాట్లాడుతూ, కొంతమందికే ఆప్కోస్‌ నుంచి జీతాలు రావడం లేదని 10ఏళ్ల అనుభవం దాటిన 119 మందినే ఎంపిక చేశామని చెప్పడంపై గంగారావు, మరికొందరు సభ్యులు అభ్యంతరం తెలిపారు. శ్మశాన వాటికలయందు మౌలిక వసతులకు నిధుల కేటాయింపు రెండేళ్లుగా టెండర్లు పిలిచినా పనులు జరగడం లేదని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ పివి.సురేష్‌, ప్రతిపక్ష టిడిపికి చెందిన పలువురు కార్పొరేటర్లు గగ్గోలు పెట్టారు. 3 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి హామీ ఇచ్చారు.
వీధిలైట్లు వెలగడం లేదు : గగ్గోలు పెట్టిన కార్పొరేటర్లు
నగరంలో సగానికిపైగా వార్డుల్లో రాత్రిపూట వీధిలైట్లు వెలగడం లేదంటూ 86వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ లేళ్ల కోటేశ్వరరావు కౌన్సిల్‌లో లేవనెత్తారు. ఇంకా పలువురు సభ్యులు ఇదే అంశంపై ఏకరువు పెట్టగా మేయర్‌ హరివెంకటకుమారి జోక్యం చేసుకుని 'వీధిలైట్ల విషయంలో జివిఎంసి ఫెయిల్‌ అయ్యిందని ఆవేదన చెందారు. కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ వివరణ ఇస్తూ నగరంలో 1.18 లక్షల లైట్లున్నాయని, వీటిని కంట్రోల్‌ చేసే సిసిఎంఎల్‌ బాక్సులు 5517 ఉన్నాయని కాంట్రాక్టు పొందిన బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ సంస్థ సక్రమంగా నిర్వహణ చేయలేకపోతుందని, మొదటి షో కాజ్‌ నోటీసు కూడా ఇటీవలే ఇచ్చామని తెలిపారు. రోజూ సాయంత్రం 6గంటలకు ఆటోమేటిక్‌గా వీధి లైట్లు ఆన్‌ అవ్వాల్సి ఉందన్నారు. సదరు సంస్థ నియంత్రణ చేయలేకపోవడం గుర్తించామని ప్రొసీజర్‌ ప్రకారం మరో రెండు నోటీసులిచ్చి ఆ కంపెనీని వదిలించుకోవాల్సి ఉందన్నారు. 98 వార్డుల్లో సుమారు 40వేల లైట్ల వరకూ రిపేరు చేశామని, భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చూస్తామన్నారు.