ప్రజాశక్తి-ముప్పాళ్ల : కౌలు రైతులకు గ్రూపుల ద్వారా పంట రుణాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ వడ్డీ రాయితీతో కూడిన పంట రుణాలను ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కౌల్దార్లకు రుణాల కోసం మండల కేంద్రమైన ముప్పాళ్లలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వద్ద గురువారం ఆందోళన చేసి మేనేజర్ కిషన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయం నష్టాల్లో సాగుతోదని, కౌలు రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూ యజమాని సంతకం అనే నిబంధనను తొలగించి కౌలు రైతు కార్డులు ఇవ్వాలన్నారు. కౌల్దార్లందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం గ్యారంటీ లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నారు. పంట రుణాలు భూ యాజమానికి ఇస్తే డబుల్ ఫైనాన్స్ అవుతుందంటూ కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయని, రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు భూమి ఆధారంగా కాకుండా పంట ఆధారంగా రుణాలు ఇవ్వాలని కోరారు. ఐదుగురు కౌల్దార్లతో కూడిన గ్రూపునకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.8 లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌల్దార్లకు రుణాలి వ్వడం ద్వారా ప్రైవేటు వడ్డీవ్యాపారుల బారిన పడకుండా చూడాలని మేనేజర్‌ను కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, కౌలు రైతు సంఘం నాయకులు టి.అమరలింగేశ్వరరావు, కౌలు రైతులు ఎ.శ్రీనివాసరెడ్డి, ఎ.రంగారెడ్డి, కె.రఘనాథరెడ్డి, ఎ.రామలింగారెడ్డి, ఎం.పెద్దారెడ్డి, ఎం.శ్రీను పాల్గొన్నారు.










