Jun 05,2023 00:12

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న రాధాకృష్ణ, ఇతర నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : భూ యజమానితో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా కౌలు రైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10, 11, 12 తేదీల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ తెలిపారు. పాదయాత్రకు ముందుగా ఈనెల 7వ తేదీ నుంచి నెల్లూరు నుంచి జీతాపు జాతా ప్రారంభం అవుతుందన్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జీపు జాతా 8, 9, 10 తేదీల్లో పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు. పాదయాత్ర చివరిరోజైన 12వ తేదీన విజయవాడ నుంచి మంగళగిరి ఆటోనగర్‌ వద్ద ఉన్న సిసిఎల్‌ఎ ఆఫీసు వద్దకు చేరుకుంటుందన్నారు. భూ యజమాని సంతకం చేయాలని నిబంధన కౌలు రైతుల జీవితాలకు శాపంగా మారిందని, దీనివలన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రావట్లేదని, గుర్తింపు కార్డులు రాకపోవడంతో రైతు భరోసా, పంట రుణాలు, పంట నష్టపరిహారాలు, పంటల బీమా కౌలు రైతులకు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను విస్మరించడం తగదని, వీరంతా పంటలు పండించే అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన వారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి వారిని ఆదుకోవాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ భూ యజమానితో ఒప్పందం చేసుకోవడం వల్ల బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని, కానీ వాస్తవంగా భూ యజమానులకే బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయని అన్నారు. కార్డు పొందినప్పటికీ పంట రుణాలు మాత్రం కౌలు రైతులకు ఇవ్వట్లేదన్నారు. సిసిఎల్‌ఎ చట్టంలో మార్పులు చేయాలని, ప్రతి గ్రామంలోనూ కౌలు రైతులతో సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. దాదాపు కోటి మంది కౌలు రైతులకు సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జీపు జాతా, పాదయాత్రలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు బి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు షేక్‌ మస్తాన్‌వలి, డి.రమేష్‌బాబు, జె.రామారావు, ఆది నికల్సన్‌, హనుమంతరావు, ఆదిశేషు పాల్గొన్నారు.