ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ
జిల్లాలో కౌలు రైతుల రాష్ట్ర ప్రచార జాతా
కౌలు రైతుల చట్టాన్ని సవరించాలని డిమాండ్
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే కౌలు రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కౌలురైతుల చట్టాన్ని సవరించి భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన ప్రచార జాతా శనివారం ఏలూరు చేరుకుంది. స్థానిక వసంత మహల్ సెంటర్ వద్ద ఈ జాతాకు రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. కౌలు రైతులకు రక్షణ కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ సాగుభూమిలో 70 శాతం భూమిని సాగు చేస్తూ పంటలు పండిస్తున్నది కౌలు రైతులేనని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వీరి రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోగా కౌలు రైతులకు నష్టం కలిగించే విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. గత కౌలు రైతుల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం రద్దుచేసి 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు.ఈనెల 12న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుండి మంగళగిరిలోని సిసిఎల్‌ఎ కార్యాలయం వరకు జరుగుతున్న కౌలు రైతుల రాయబార కార్యక్రమ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయంలో కష్టపడుతున్న కౌలు రైతులు పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పెరిగిన పెట్టుబడులు రీత్యా రైతు భరోసా పెట్టుబడి సాయం రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అంగులూరి జాన్‌బాబు, ఆటో ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుద్దా నాగసూరిబాబు, జిల్లా కార్యదర్శి ఎ.గోపి, ఎల్‌ఐసి యూనియన్ నాయకులు కనకారావు, కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కో- కన్వీనర్ శ్రీరామచంద్రమూర్తి, వెంకటరామరాజు పాల్గొన్నారు.
నిడమర్రు:కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాష్ట్ర ప్రచార జాతా మండలంలోని భువనపల్లి, నిడమర్రు గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 పంట సాగుదారు హక్కు చట్టం వల్ల కౌలురైతులకు పెద్దగా ప్రయోజనం లేదన్నారు. భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమన్నారు. గ్రామ సచివాలయ, రైతు భరోసా సిబ్బంది ఆధారంగా గ్రామాల్లో కౌలు రైతులను గుర్తించి భూ యజమానుల సంతకాలతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డు మంజూరు చేయాలని కోరారు. పంట నష్టపరిహారాలు కౌలు రైతులకే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లికోన శ్రీనివాసరావు, వెలగలేటి మోహన్, గవర సత్యనారాయణ, కనకరెడ్డి శ్రీను పాల్గొన్నారు.
భీమడోలు:ఉద్యమాల ద్వారానే కౌలు రైతుల రక్షణ సాధ్యమని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ఎపి కౌలు రైతు సంఘం చేపట్టిన రాష్ట్ర ప్రచార జాతా భీమడోలు మండలంలో శనివారం సాగింది. దీనిలో భాగంగా పూళ్ల, కురెళ్లగూడెం, భీమడోలు, గుండుగొలను గ్రామాల మీదుగా కొనసాగిన యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో కె.శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, కౌలు రైతుల సంఘ నాయకులు కె.అప్పారావు, వి.శ్రీరామచంద్రమూర్తి, జికృష్ణ, బాలాజీ పాల్గొన్నారు.
ఉంగుటూరు:వ్యవసాయంలో కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. కౌలు రైతుల సంఘం చేపట్టిన రాష్ట్ర ప్రచార జాతా ఉంగుటూరు మండలంలోని నారాయణపురం, చేబ్రోలు, కైకరం గ్రామాల గుండా సాగింది. ఆయా గ్రామాలలో జరిగిన సభల్లో సూర్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కోకన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఇందుకూరి వెంకటరామరాజు పాల్గొన్నారు.










