పంటరుణాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం
పూర్తిస్థాయిలో అందని కౌలుకార్డులు
రబీలోనైనా రుణాలందించేనా
కౌలురైతుల గోడుపట్టని వ్యవసాయాధికారులు
పెట్టుబడుల కోసం నానావస్థలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఆరుగాలం కష్టపడి పండించే కౌలురైతులపై ప్రభుత్వానికిగానీ, అధికారులకుగానీ కనికరం లేకుండా పోయింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ సాగులో అత్యధిక మంది కౌలురైతులే ఉన్నారు. అధికారుల లెక్కల ప్రకారం చూసినా రెండు జిల్లాల్లో మూడు లక్షల మంది వరకూ కౌలురైతులున్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం వీరే సాగుచేస్తున్నారు. కౌలురైతులందరికీ కౌలుకార్డులు జారీచేసి పంటరుణాలివ్వాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వంగానీ, అధికారులుగానీ అటువైపు ఆలోచన చేయడం లేదు. రెండు జిల్లాలోనూ నిర్ధేంచుకున్న కౌలుకార్డుల లక్ష్యం కేవలం లక్షా 36 వేలు మాత్రమే. పశ్చిమగోదావరి జిల్లాలో 79 వేలు, ఏలూరు జిల్లాలో 57 వేలు కార్డులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ లక్ష్యం ప్రకారం చూస్తే దాదాపు మరో లక్షన్నర మంది కౌలురైతులను కౌలుకార్డులకు దూరం చేశారు. అధికారుల లక్ష్యం మేరకైనా కౌలుకార్డులు మంజూరు కాలేదు. కౌలుకార్డుల మంజూరులో నిర్లక్ష్యం.. బ్యాంకుల నుంచి పంటరుణాలు ఇవ్వడంలోనూ కొనసాగుతోంది. గతంలో కౌలురైతులకు రుణాల మంజూరులో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి బ్యాంకు అధికారులతో మాట్లాడేవారు. దీంతో కౌలుకార్డు అధారంగానీ, రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసైనా పంటరుణాలు మంజూరు చేసేవారు. గత ప్రభుత్వ హయాంలో రైతుసంఘాలు, రైతులు పోరాట ఫలితంగా కౌలురైతులకు రూ.వెయ్యి కోట్ల వరకూ బ్యాంకులు రుణాలిచ్చిన పరిస్థితి ఉంది. వైసిపి ప్రభుత్వంలో కౌలురైతుల గురించి పట్టించుకోవడం లేదు. కౌలుకార్డులు, మంజూరైన రుణాలు లెక్కలు సైతం వ్యవసాయ అధికారులుగానీ, బ్యాంకు అధికారులుగానీ చెప్పడం లేదు. కౌలురైతులకు బ్యాంకు రుణాలందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఏలూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలోని వ్యవసాయశాఖ జిల్లా అధికారులు రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్‌లో కౌలురైతులకు అందిన రుణాలు అతితక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రబీలోనైనా రుణాలు మంజూరు చేయాలని కౌలురైతులు కోరుతున్నారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో ఎకరాకు తక్కువగా లెక్కించినా రూ.35 వేలకు పైగా పెట్టుబడి ఖర్చవుతోంది. గతంలో పండిన ధాన్యం గ్రామాల్లోని కమీషన్ వ్యాపారులకు, మిల్లర్లుకు రైతులు అమ్ముకునేవారు. దీంతో ముందస్తుగా వ్యాపారులు, మిల్లర్లే పెట్టుబడులు పెట్టేవారు. ధాన్యం విక్రయించిన తర్వాత వారి సొమ్ములు వారు తీసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక్రాప్ ఆధారంగానే కొనుగోలు చేస్తోంది. దీంతో ధాన్యం సొమ్ము నేరుగా ఇ-క్రాప్ జరిగిన భూయజమానుల ఖాతాల్లోనే పడుతున్నాయి. దీంతో వ్యాపారులు, మిల్లర్లు ముందస్తు పెట్టుబడులు పెట్టడం ఆపేశారు. దీంతో వ్యవసాయ పెట్టుబడులకోసం కౌలురైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి పంట రుణాలిస్తే కౌలురైతులకు మేలు జరుగుతేంది. ప్రభుత్వం ఈ విధమైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో కౌలురైతులు పుస్తెలు సైతం తాకట్టుపెట్టి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. వ్యవసాయమంటేనే కౌలురైతులు భయపడే పరిస్థితి నెలకొంది. రబీలోనైనా కౌతురైతులకు బ్యాంకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
ప్రభుత్వ సాయం సైతం అందని పరిస్థితి
ఇ-క్రాప్ ఆధారంగానే ప్రభుత్వం అందించే రైతు భరోసా, బీమా, పంట నష్టపరిహారం అందుతున్నాయి. ఇ-క్రాప్‌లో భూ యజమాని పేరు తప్ప కౌలురైతుల పేర్లు నమోదు కావడం లేదు. కౌలురైతుల పేర్లు నమోదు కావాలంటే కౌలుకార్డులుండాలి. కౌలురైతులకు అవి అందడం లేదు. 2019లో కౌలుచట్టంలో చేసిన మార్పులు కౌలురైతులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో పంట దెబ్బతిన్న పరిహారంగానీ, బీమాగానీ, రైతుభరోసా సాయంగానీ కౌలురైతులకు అందడం లేదు. వ్యవసాయం కూడా చేయని భూయజమాని ఖాతాల్లోకి ఇవి చేరిపోతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.










