Feb 27,2023 21:32

నూజివీడు వ్యవసాయ సహాయ సంచాలకులు విద్యాసాగర్‌
ప్రజాశక్తి - ముసునూరు

          మొక్కజొన్న పంటలో కండెలు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కౌలు రైతుకు న్యాయం చేస్తామని, నష్ట పరిహారం వచ్చేలా చూస్తామని నూజివీడు వ్యవసాయ సహాయ సంచాలకులు జి.విద్యాసాగర్‌ చెప్పారు. నూజివీడు మండలానికి చెందిన వేముల వెంకట్రావు ముసునూరు మండలంలోని చింతలవల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 6.34 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో మొక్కజొన్న పంటలో కండెలు రాలేదుని మనస్తాపానికి గురైన ఆయన ఇటీవల గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వెంకట్రావు నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ మొక్కజొన్న పంటను పరిశీలించాలని రైతు సంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ నర్సింహ నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌రాజేంద్రన్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు నూజివీడు వ్యవసాయ సహాయ సంచాలకులు జి.విద్యాసాగర్‌, ముసునూరు మండల వ్యవసాయాధికారి సిహెచ్‌.శ్రీనివాసరావుతో కలిసి మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ కౌలు రైతుకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. డిఎన్‌ఎ టెస్టులు చేయాలా, జన్యుపరమైన లోపాలున్నాయా, లేదా అనే విషయంపై శాస్త్రవేత బృందం వచ్చిన తరువాత పరిశీలించి జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు రైతుకు ఎంత నష్ట పరిహారం ఇవ్వాలనేది తెలియజేస్తామని చెప్పారు. రైతులు కూడా వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు పాటించి విత్తనాలు నాటాలని సూచించారు.